
గోపీచంద్ హీరోగా నటించిన తాజా చిత్రం “సౌఖ్యం” ఆడియో వేడుక ఒంగోలులో అంగరంగ వైభవంగా జరిగింది. అశేష అభిమానుల సమక్షంలో అనూప్ రూబెన్స్ స్వరపరచిన బాణీలు విడుదల కాగా, ఈ సందర్భంగా విడుదల అయిన ధియేటిరికల్ ట్రైలర్ అభిమానులకు సినిమా విజయంపై నమ్మకాన్ని పెంచింది. ‘లౌక్యం’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న గోపీచంద్ మరోసారి అదే దారిని ఎంచుకున్నారని ట్రైలర్ స్పష్టం చేసింది.
‘సౌఖ్యం’ ట్రైలర్ విశిష్టతల గురించి చెప్పడానికి ఏమీ లేదు… గోపీచంద్ లుక్, పవర్ ఫుల్ డైలాగ్స్, కోన వెంకట్, గోపీ మోహన్ ల ట్రీట్ మెంట్, బ్రహ్మి కామెడీ… యాజిటీజ్ ‘లౌక్యం’ సినిమాను గుర్తు చేసే విధంగానే ఉన్నాయి. ఇటీవల కాలంలో తన కామెడీ టైమింగ్ తో దుమ్ముదులుపుతున్న ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృథ్వీ కామెడీయే మరోసారి హైలైట్ కాబోతుందన్న సంకేతాలు కనపడుతున్నాయి. టాలీవుడ్ ‘లిప్ లాక్’ల భామ రెజీనా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో హిట్ బాట పట్టిన ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించారు.
‘యజ్ఞం’ సినిమాతో గోపీచంద్ కు ఫస్ట్ కమర్షియల్ హిట్ అందించిన రవికుమార్, ఎటువంటి ప్రయోగాల జోలికి పోకుండా, ఫక్తు కమర్షియల్ ఎలిమెంట్స్ తో “సౌఖ్యం”ను తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది. అయితే గోపీచంద్ ఇంతకు ముందే ‘లౌక్యం’ చేయడం ‘మైనస్’గా మారింది. ప్రేక్షకులను ఏ విధంగా ఆలరిస్తుందో తెలియాలంటే ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన పనిలేదు… డిసెంబర్ 25వ తేదీన “సౌఖ్యం”ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని చిత్ర యూనిట్ డిక్లేర్ చేసేసింది. గోపీ అభిమానులు… అప్పటివరకు ధియేటిరికల్ ట్రైలర్ చూసుకోండి..!





