ఎస్పీని వద్దనుకున్నారు సరే మొగిలయ్యని గౌరవించారా?

SP Balasubrahmanyam statue proposal at Ravindra Bharathi amid cultural debate

హైదరాబాద్‌, రవీంద్ర భారతిలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే కల్వకుంట్ల కవితతో సహా పలువురు అభ్యంతరం తెలిపారు. ‘ఆంధ్రా గాయకుడి విగ్రహం ఇక్కడెందుకు? మాకెందుకు?’ అన్నట్లు చాలా అనుచితంగా మాట్లాడారు. అయితే తమ ఇంట్లోనే, పార్టీలోనే ఓ ‘తారక రామారావు’ ఉన్నారనే విషయం అందరూ మరిచిపోయారు.

కులమతాలు, భాష ప్రాంతాలకు అతీతుడైన అమర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై కూడా ‘ఆంధ్రా ముద్ర’ వేసి వద్దనుకున్నారు సరే!

ADVERTISEMENT

మరి తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమైన జానపద కళాకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యని ఏవిధంగా గౌరవించుకున్నారు? ఎల్బీ నగర్‌ మెట్రో పిల్లర్‌పై జీహెచ్ఎంసీ ఆయన చిత్రం గీయిస్తే దానిపై వ్యాపార ప్రకటనల పోస్టర్లు అంటించారు.

ప్రతీరోజూ ఆ దారిన వేలమంది ప్రయాణిస్తుంటారు. వారిలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఉంటారు. కానీ ఏ ఒక్కరూ పట్టించుకోలేదు.

పద్మశ్రీ దర్శనం మొగిలయ్యగారు మూడు రోజుల క్రితం ఎల్బీ నగర్‌లో ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని తిరిగి వెళుతున్నప్పుడు మెట్రో పిల్లర్‌పై తన బొమ్మపై వ్యాపార ప్రకటనల పోస్టర్లు అంటించి ఉండటం చూసి బాధ పడ్డారు. వాటిని ఆయన స్వయంగా తొలగించి శుభ్రపరిచారు.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆయన అక్కడ నిలబడి వాటిని శుభ్రం చేస్తున్నప్పుడు ఆ దారిన వేలాదిమంది ప్రయాణించారు. కానీ వారిలో ఏ ఒక్కరూ ఆయనే మన పద్మశ్రీ దర్శనం మొగిలయ్య అని గుర్తించనే లేదు. ఒకవేళ గుర్తించినా ఎవరికీ ఆయనని పలకరించే ఆసక్తి, సాయపడే ఓపిక, తీరిక రెండూ లేవు!

తెలంగాణకు, తెలుగు ప్రజలందరికీ గర్వకారణమైన ఆ గొప్ప కళాకారుడు దర్శనం మొగిలయ్యగారిని ‘ఆంధ్రాకు చెందిన పవన్‌ కళ్యాణ్‌’ మొదట గుర్తించి తన ‘భీమ్లా నాయక్’ సినిమా ద్వారా అయన పాటని లోకానికి పరిచయం చేశారు. అప్పటి నుంచే అందరూ ఆయనని గుర్తించడం మొదలైంది.

ఓ కళాకారుడిని కళాకారుడిగానే చూడాలి తప్ప కులమతాలు, భాష, ప్రాంతీయవాదంతో చూడరాదని పవన్‌ కళ్యాణ్‌ ఆనాడే నిరూపించి చూపారు.

కానీ రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేయబోతే కల్వకుంట్ల కవితతో సహా పలువురికి ఆయన ఆంధ్రా గాయకుడుగానే కనిపించారు. తమ కళాకారుడిని కనీసం గుర్తించి, గౌరవించలేని స్థితిలో ఉన్నప్పుడు ఇంతింత పెద్ద మాటలెందుకు?

ADVERTISEMENT
Latest Stories