దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే నవ్వులపాలవుతోంది. దేశంలో ఎక్కడ మత్తుమందులు, గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే దొరుకుతున్నాయి. నాలుగున్నరేళ్ళ వైసీపి పాలన గురించి ఎంత చెప్పుకొన్నా తరగదు.
ఇవన్నీ సరిపోవన్నట్లు ఇప్పుడు నెల్లూరుకి చెందిన ఇద్దరు వైసీపి నేతల కుమారులు హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాలతో పార్టీ చేసుకొంటూ తెలంగాణ మాదకద్రవ్యాల నిరోధక శాఖ (టిఎస్ న్యాబ్) అధికారులకు పట్టుబడ్డారు. వారిలో ఒకరు నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ ఆధారిటీ మాజీ ఛైర్మన్ ముక్కాల ద్వారకానాధ్ కుమారుడు ప్రేమ్ చంద్.
హైదరాబాద్ ఎస్సార్ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో శనివారం రాత్రి ప్రేమ్ చంద్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. దానిలో గోవా నుంచి తెచ్చిన మాదకద్రవ్యాలతో పార్టీ జరుగుసమాచారం అందుకొన్న పోలీసులు దాడి చేయగా మొత్తం ప్రేమ్ చంద్‌తో సహా 12 మంది యువకులు పట్టుబడ్డారు. మరో 21 మంది పరారయ్యారు.
నెల్లూరుకు చెందిన జల్లి ఆశిక్ యాదవ్ హైదరాబాద్ వచ్చి ఓ బీపీవో కంపెనీలో చేరాడు. నెల్లూరుకే చెందిన మిత్రులు రాజేష్, సాయిచరణ్ అక్కడే పరిచయమయ్యారు. వారు తరచూ గోవా వెళ్ళి వస్తుండటంతో అక్కడే డ్రగ్స్ అలవాటైంది. క్రమంగా గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో ప్రముఖులకు, వారి పిల్లలకు అమ్మడం మొదలుపెట్టారు. శనివారం రాత్రి ప్రేమ్ చంద్ పుట్టినరోజు సందర్భంగా అందరూ కలిసి డ్రగ్స్ పార్టీ చేసుకొంటుండగా పట్టుబడ్డారు.
అయితే హైదరాబాద్‌లో ప్రేమ్ చంద్‌ని పోలీసులు అరెస్ట్ చేసిన్నట్లు సమాచారం అందడంతో కొందరు వైసీపి పెద్దలు రాత్రికి రాత్రి కార్లలో వచ్చి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద వాలిపోయారు. అంతే!ఎఫ్ఐఆర్‌లో ప్రేమ్ చంద్, మరో వైసీపి నేత కొడుకు పేర్లు మాయం అయిపోయాయి!
మంత్రులు, వైసీపి ఎమ్మెల్యేలు నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎలాగూ పరువు తీసుకొంటూనే ఉన్నారు. ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో కూడా వారి సుపుత్రులు డ్రగ్స్ కేసులలో పట్టుబడుతూ అక్కడా ఆంధ్రప్రదేశ్ పరువు తీసేస్తున్నారు.
తెలంగాణ సిఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే నగరంలో మాదకద్రవ్యాల సరఫరా, వాడకంపై ఉక్కుపాదం మోపాలంటూ టిఎస్‌న్యాబ్‌కు కొత్త అధికారులను నియమించారు. వారు మొదటి దాడిలోనే వైసీపి నేతల కుమారులు పట్టుబడ్డారు. దీంతో ఏపీ పరువు ఎలాగూ పోతుంది. వైసీపి నేతల పరువు కూడా పోతోంది కదా?




