రివ్యూతో నవ్వులు పూయించిన బ్యాట్స్ మెన్!

Sri Lanka - Bangladesh 1st Testశ్రీలంక – బంగ్లాదేశ్ జట్ల మధ్య గాలేలో జరిగిన మొదటి టెస్ట్‌ మ్యాచ్ లో శ్రీలంక ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో రెండు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆటగాడు సిక్సర్ కొడితే, అది ఔట్ అనుకుని బంగ్లా బౌలర్ సంబరాలు జరుపుకుని అందరినీ షాక్ కు గురి చేసాడు. అయితే ఆ తర్వాత అది కాస్త కామెడీగా మారిపోగా, తాజాగా ఇదే టెస్ట్ మ్యాచ్ లో మరో కామెడీ ఘటన జరిగింది.

శ్రీలంక ఆటగాడు అసేల గుణరత్నే బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ కు బంతిని సంధించగా, అది స్పిన్ అవుతుందని భావించిన సౌమ్య సర్కార్ దానిని షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే అది ఎలాంటి మలుపులు తిరగకుండా నేరుగా వెళ్లి ఆఫ్ స్టంప్ ను ముద్దాడి బెయిల్ ను గిరాటేసింది. అలా క్లీన్ బౌల్డ్ కావడంతో, అంపైర్ ‘ఔట్’ అంటూ సిగ్నల్ చూపించారు. ఇక్కడే అసలు ‘ట్విస్ట్’ చోటు చేసుకుంది. ఈ ‘అవుట్’పై బ్యాట్స్ మెన్ రివ్యూ కోరడం మైదానంలో ఉన్న ప్రేక్షకుల చేత కూడా నవ్వు తెప్పించింది.

ADVERTISEMENT

తాను క్లీన్ బౌల్డ్ అవడాన్ని గమనించని సౌమ్య సర్కార్… అయోమయంగా చూస్తూ, బాల్ ప్యాడ్‌ కి తగల్లేదు, కనీసం బ్యాట్‌ ని తాకలేదు, ఎందుకు ఔట్ ఇచ్చారు? అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్ ఇచ్చి, అంపైర్ ను రివ్యూ కోరాడు. దీంతో అందరూ పెద్దగా నవ్వేయడంతో… తాను ‘క్లీన్ బౌల్డ్’ అయిన అసలు విషయాన్ని గమనించిన సౌమ్య తను కూడా చిన్నగా నవ్వుకుంటూ పెవిలియన్ బాటపట్టాడు. దీంతో స్టేడియంలో కూడా నవ్వులు పూశాయి. 53 పరుగుల సౌమ్య సర్కార్ ఇన్నింగ్స్ బంగ్లాను ఓటమి నుండి బయట పడలేకపోయింది.

ADVERTISEMENT
Latest Stories