63వ జాతీయ సినిమా అవార్డుల వేడుకలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ళిన దర్శక ధీరుడు రాజమౌళిని మీడియా వర్గాలు అడిగిన ప్రశ్న… హాలీవుడ్ సినిమా ఎప్పుడు తీస్తున్నారు అని? అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘బాహుబలి’ వంటి సినిమా తీసిన తర్వాత ఒక్కసారిగా జాతీయ వ్యాప్తంగా పాపులర్ అయిన రాజమౌళిని ఈ ప్రశ్న అడగడంలో ఆశ్చర్యం లేదు గానీ, దీనికి జక్కన్న చెప్పిన సమాధానం టాలీవుడ్ ప్రియులకు సంతోషాన్ని పంచుతోంది.
ప్రస్తుతం హాలీవుడ్ పై తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని ఓ స్పష్టమైన సమాధానం చెప్పడంతో మరో ఆలోచనకు ఆస్కారం లేకుండా పోయింది. ‘బాహుబలి’ సినిమా సాధించిన విజయం తర్వాత ప్రతి హీరో అభిమానులు రాజమౌళితో తమ హీరో సినిమా ఉండాలని ఊవ్విళ్ళూరుతున్నారు. అయితే ఇప్పటికే మహేష్ బాబుతో సినిమాను ప్రకటించిన రాజమౌళి, అన్ని కుదిరితే జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా తెరకెక్కించే అవకాశం లేకపోలేదు అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
‘బాహుబలి’ లాంటి సినిమా చూసిన తర్వాత రాజమౌళికి హాలీవుడ్ అవకాశం రావడం పెద్ద విషయం కాదు. అయితే అటు వైపుకు మొగ్గు చూపకుండా తెలుగు చిత్రాలకే దర్శకత్వం వహిస్తానని చెప్పడంతో తెలుగు సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ హీరోలను మించిపోయే రేంజ్ లో ఈ దర్శక ధీరుడు ‘జక్కన్న’కు క్రేజ్ ఉంది మరి!



