తెలుగు సినీ చరిత్రను మలుపు తిప్పిన నేటితరం దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. బాహుబలికి ముందు బాహుబలి తరువాత అన్నట్టుగా టాలీవుడ్ దశా దిశను మార్చారు జక్కన్న.
కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు మత్రమే పరిమితమైన తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పారు. శాంతి నివాసం అనే ఈటీవీ సీరియల్ తో మొదలైన రాజమౌళి ప్రస్థానం 2001 లో స్టూడెంట్ నెంబర్ -1 తో వెండితెర మీద ప్రత్యక్షమయ్యింది.
ఇక అక్కడి నుంచి సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ వరకు అపజయం అనేది లేకుండా సాగింది. ఇక ఆ తరువాత 2009 లో వచ్చిన మగధీర అటు హీరో రాంచరణ్ కెరీర్ తో పాటుగా రాజమౌళి గ్రాఫ్ ను కూడా అమాంతం ఆకాశానికెక్కించింది.
అలాగే తెలుగు సినిమా స్థాయిని 100 కోట్లకు చేర్చి అప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఆ తరువాత సునీల్ తో మర్యాదరామన్న అంటూ కూడా జక్కన్న తన విజయాల మర్యాదకు మాట రాకుండా చూసుకున్నారు. ఇక 2012 ఈగతో రాజమౌళి కళాత్మకత యావత్ సినీ ప్రపంచానికి తెలిసొచ్చింది.
టాలీవుడ్ అప్పటి వరకు చూడని విజువల్ ఫీస్ట్ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసాడు జక్కన్న. ఒక ఈగ తో సినిమా నా అంటూ ఎత్తిన ప్రతి వేలుని తన విజన్ తో మూయించారు. మగధీర తో టాలీవుడ్ కి 100 కోట్ల మార్కును రుచి చూపిన రాజమౌళి ఈగతో తెలుగు సినిమాకు హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ మాయాజాలాన్ని పరిచయం చేసారు.
ఇక 2015 లో వచ్చిన బాహుబలి: ది బిగినింగ్ తో వెండితెర మీద గ్రాఫిక్స్ అద్భుతాలను ఆవిష్కరించింది. అలాగే వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే ఉత్సకతను యావత్ సినీ ప్రపంచం ముందుంచింది. ఇక దాని కొనసాగింపుగా 2017 లో వచ్చిన బాహుబలి: ది కంక్లూజన్ ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1800 కోట్లు కొల్లగొట్టి ఇండియా సినిమా చరిత్రలోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
బాహుబలి సినిమా మొత్తం ఇండియా సినిమా రూపు రేఖలనే మార్చేసింది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అలాగే ఒక సాధారణ ప్రేక్షకుడు సినిమాను చూసే దృష్టిని కూడా జక్కన్న తన బాహుబలితో మార్చేశారు. ఇక ఆ సమయంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరి నోటా జక్కన్న నామజపమే నడిచింది.
ఇక 2022 లో వచ్చిన తారక్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ మూవీ RRR ఏకంగా తెలుగు సినిమాకు ఆస్కార్ దక్కేలా చేసింది. అలాగే నాటు నాటు అంటూ యావత్ సినీ ప్రపంచాన్ని RRR వైపు చూసేలా చేసారు. ఇలా శాంతి నివాసం అనే ఈ టీవీ సీరియల్ తో మొదలైన రాజమౌళి రంగుల ప్రపంచం ఎన్నో అవార్డులను అందుకుంటూ ఎన్నో రివార్డులను పొందుతూ సాధరణ ప్రేక్షకుడి నుండి సెలబ్రెటీల వరకు అందరి నుండి ప్రశంసలు పుచ్చుకుంటూ ఆస్కార్ వరకు సాగింది.
ఇక రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న SSMB మూవీ పై కూడా ప్రపంచ సినీ లోకం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అలాగే ఈ మూవీ ద్వారా జక్కన్న తెలుగు సినిమాను మరో మెట్టెక్కించడం ఖాయం అంటున్నారు టాలీవుడ్ అభిమానూలు. ఈ సందర్భంగా జక్కన్న సినిమాకు ఆల్ ది బెస్ట్ చెపుతూ M9 తరుపున SS రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు.




