తొక్కిసలాటకు కాదేది అనర్ధం అన్నట్టుగా క్రీడా కార్యక్రమాల నుంచి దేవుని దర్శనాల వరకు, సినిమా వంటి వినోదాల నుంచి పొలిటికల్ సభల వరకు ప్రతి చోట తొక్కిసలాటలు కామన్ గా జరుగుతూనే వస్తున్నాయి, అభం శుభం తెలియని అమాయక ప్రజలు ప్రాణాలు పోతూనే ఉన్నాయి.
అయితే ఇక్కడ తప్పెవరిది అంటూ నిందలు వేస్తూ, చర్చలు జరుపుతూ కూర్చునేలోపే మరెక్కడో ఈ తొక్కిసలాట ఇంకొంతమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. పుష్ప – 2 ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటకు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు ఇప్పటికి కోలుకోలేదు. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన వారు ఇప్పటికి మాములు స్థితికి రాలేదు.
ఇదిలా ఉంటే ఇక మౌని అమావాస్య పర్వ దినం, పవిత్ర సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తే పాపదోషులు తొలిగిపోతాయని, పుణ్యం సిద్దిస్తుందంటూ కుంభమేళాకు పోటెత్తిన భక్తులు తొక్కిసలాటలో ఊపిరాడక ప్రాణాలు విడిచారు. నాడు అక్కడ కనిపించిన దృశ్యాలు, వినిపించిన అహకారాలు వాటిని చూసిన ప్రతి ఒక్కరికి తీవ్ర ఆవేదనను కలిగించాయి.
ఆ తరువాత వైకుంఠ ఏకాదశి తిరుమల వెంకన్న దర్శనానికి టోకెన్ల కోసం వచ్చి తొక్కిసలాటలో సమిధులైన కుటుంబాలు నేటికీ ఆ చేదు ఘటన నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇక చందనోత్సవం సందర్భంగా సింహాచలం అప్పన్న దర్శనానికి వెళ్లి అక్కడ తొక్కిసలాటకు ప్రాణాలు విడిచిన భక్తుల కుటుంబాలు ఇప్పటికి తమ దోషమేమిటి అంటూ రోదిస్తూనే ఉన్నారు.
అలాగే 18 ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఆర్సీబి జట్టు ఐపీల్ కప్పును అందుకున్న సందర్భంగా బెంగళూర్ లోని చిన్న స్వామి స్టేడియం ముందు ఆర్సీబి, కర్ణాటక ప్రభుత్వం కలిపి నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ పదుల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంది. ఒక వినోదాన్ని ఆస్వాదించడానికనొస్తే అది ఇంతటి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది అంటూ రోదించారు తొక్కిసలాట బాధిత కుటుంబాలు.
ఇక తాజాగా చెన్నైలోని కరూర్ ప్రాంతంలో టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన ఒక పొలిటికల్ సభ కూడా ఈ తొక్కిసలాటతో రసాభాసగా మారింది, అనేకమంది కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపింది. ఇలా సమయం ఏదైనా సందర్భం ఎక్కడున్నా తొక్కిసలాట అనేది నీడలా మనుషుల ప్రాణాలను వెండాడుతూనే వస్తుంది.
నవంబర్ 1 కార్తీక ఏకాదశి, శనివారం అన్నీ కలిసి రావడంతో ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజు, నేడు దేవాలయాలలో పూజలు చేస్తే అది వారి కుటుంబాలలో వెలుగులు నింపుతుంది అనే భావనతో దీపాలు వెలిగించి దైవ దర్శనం చేసుకోవడానికొచ్చిన కాశీబుగ్గ దేవాలయంలోని భక్తులకు దేవుని దర్శనానికి ముందే మరణం దర్శనమిచ్చింది.
ఈ తొక్కిసలాట 10 మంది జీవితాలను, వారి కుటుంబాలను చీకటిలోకి నెట్టేసింది. ఇక్కడ ప్రజల ప్రాణాలు పోతున్నాయి, కానీ దోషులెవరు అనేది తేల్చలేకపోతున్నారు. కాబట్టి రానున్న కార్తీక సోమవారాలు, పౌర్ణమి వంటి శుభదినాలు దేవాలయాలకు వెళ్లే భక్తులు ఎవరి ప్రాణాలను వారే కాపాడుకుంటూ పక్క వారి ప్రాణాలను ఆపదలోకి నెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి చేతిలోనూ ఉంది.
దేవుని దర్శనం చేసుకోవడానికి, దేవాలయంలో అడుగు పెట్టడానికి తిధులు, వర్జాలు, శుభ ముహూర్తాలు చూసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి రాయిలోనూ, ప్రతి చెట్టులోను, ప్రతి పుట్టలోను దేవుని ప్రతిరూపాన్ని చూస్తుంది హిందూ సమాజం.
అలాంటి వారు పలానా దేవాలయంలో, పలానా రోజు పూజలు చేస్తే మాత్రమే అవి దేవుని వద్దకు చేరుతాయి, లేకుంటే మన పూజలు అప్రయోజనం అనే అపోహలు వదలుకోవాలి. కిక్కిరిసిన జనసమూహాలు కనిపించే ప్రదేశాలకు ఎంత దూరంగా ఉంటె అది వారి ప్రాణానైకి అంత రక్షణ.
అది సినిమా ధియేటర్ అయినా, క్రికెట్ స్టేడియం అయినా, దేవాలయాలైనా లేక పుణ్య స్నానాలు ఆచరించే ప్రదేశాలైనా ముందు మనిషి ప్రాణానికి విలువనివ్వాలి, ఆ తరువాతే స్వకార్యమైన, పుణ్యకారేమైనా అనేది గ్రహించాలి.
లేకుంటే జనసమూహాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో కనిపించే ఇచట”దొంగలున్నారు జాగ్రత్త”…”ప్రమాదాలు జరుగు ప్రదేశము”…”ఎవరి వస్తువులకు వారే బాధ్యులు” అంటూ కనిపించే హెచ్చరిక బోర్డులు మాదిరి కొద్దీ రోజులలో “ఇచ్చట తొక్కిసలాట జరిగే ప్రమాదం కలదు” అనే సైన్ బోర్డులు కూడా అన్ని ప్రదేశాలలో పెట్టె పరిస్థితులు వస్తాయేమో బహుశా..!




