తమకు నచ్చితే యానిమేషన్ వంటి టెక్నాలిజీ సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులు తమను ఆకట్టుకోకపోతే స్టార్ డం ఉన్న హీరోల సినిమాలను సైతం తిరస్కరిస్తున్నారు. అంటే ఇక్కడ స్టార్ హీరో బలవంతుడా.? లేక కథ, కథనం, అది చెప్పే విధానం బలమైనదా.? అనేది ఒక్కసారి సినీ దర్శకులు ఆలోచించుకోవాలి.
రీసెంట్ గా ధియేటర్ లలోకి వచ్చిన యానిమేషన్ మూవీ నరసింహ కొన్ని రోజుల పాటు బాక్స్ ఆఫీస్ ని రూల్ చేసింది. అలాగే అదే సమయంలో వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, విజయ్ కింగ్ డం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
పవన్ హరిహరవీరమల్లు నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చినట్టు సినీ సర్కిల్స్ లో గట్టి ప్రచారమే జరిగింది. అంటే ఇక్కడ పవన్ స్టార్ డం కానీ విజయ్ యూత్ ఫాలోయింగ్ కానీ ఆ సినిమాలను విజయ తీరాలకు చేర్చలేకపోయాయి. అంటే లోపం ఎక్కడున్నట్టు.?
అలాగే చిన్న సినిమాల విషయంలో కూడా పెద్ద విజయాలను అందిస్తున్న ప్రేక్షకుడు కొన్ని కొన్ని పెద్ద సినిమాల విషయంలో చిన్న చూపు ఎందుకు చూస్తున్నాడు. లిటిల్ హార్ట్స్ అంటూ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెర్ పెద్ద విజయాన్ని అందుకోగలిగారు.
కానీ పెద్ద హీరోలుగా చెలామణి అవుతున్న కొంతమంది టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఒక్క హిట్ కోసం ఏళ్లతరబడి ఎదురు చూస్తున్నారు, చూస్తూనే ఉంటున్నారు. అయితే ఇక్కడ సమస్యకు కారణం ఎవరు.? సినిమాలకు కూడా ఒక సక్సెస్ ఫార్ములా అనేది ఉంటుందా.? అనే ఎన్నో ప్రశ్నలు సమాధానం కోసం వేచి చూస్తున్నాయి.
ప్రేక్షకులు, అభిమానులు తమ నుంచి ఎం ఆశిస్తున్నారు అని గ్రహించలేని స్టార్ హీరోలదా.? లేక పలానా హీరో నుంచి వారి అభిమానులు ఆశించేది ఇదే అంటూ వారే ఒక స్థిర అభిప్రాయానికొచ్చేస్తున్న దర్శకులదా.? తీసిన ప్రతి సినిమా హిట్ అవ్వాలని లేదు కానీ తీసే ప్రతి సినిమాలో గత తప్పిదాలను సరిదిద్దుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం, ఆవశ్యకత అటు హీరోలకు, ఇటు దర్శక నిర్మాతలకు ఉండాలిగా అనేదే సగటు సినీ ప్రేక్షకుడి వాదన.
మాస్ సినిమా అంటే నాలుగు ఫైట్లు, ఆరు పాటలు, అరడజను పంచ్ డైలాగ్స్, అవసరం లేని ఎలివేషన్లు, మితిమీరిపోతున్న వైలెన్స్ లు అన్నట్టుగా సినిమాలు తీస్తుంటే అందుకు ప్రేక్షకుడు ఆమోద ముద్రవేయాలంటూ అది మీ బాధ్యత అంటూ అభిమానులకు ఆర్డర్ వేస్తే అవి సినిమా ఫలితాలను తిరగ రాయగలుగుతాయా అనేది ఆలోచించుకోవాలి.?




