వీధి శునకాల మీద ప్రేమ చూపించే ఈ శునక ప్రేమికులు వాటి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న పసిపిల్లల విషయంలో ఏం సమాధానం చెపుతారు.? వారి తల్లితండ్రుల కడుపుకోతకు ఎటువంటి పరిష్కారం చూపుతారు.?
నాడు శునకాల సమస్యకు సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ ఇదేదో దేశ అంతర్గత భద్రతకు వాటిల్లిన పెను ప్రమాదం అన్నట్టుగా సోషల్ మీడియాలో నానా హంగామా చేసి, ఢిల్లీ వీధులలో తమ నిరసనలతో వీరంగం సృష్టించిన ఈ సోకాల్డ్ యానిమల్ లవర్స్ ఇప్పుడు వాటి వేటకు బలై ప్రాణాలు కోల్పోతున్న వారి భద్రతకు ఎటువంటి హామీ ఇస్తారు.?
తాజాగా హన్మకొండలోని రోడ్డు మీద నడుస్తున్న ఒక చిన్నారిపై అక్కడ ఉన్న 8 వీధి కుక్కలు వేటాడి, వెంటాడి దాడి చేసాయి. అయితే ఆ సమయానికి అటుగా వస్తున్న ఒక వ్యక్తి ఆ దాడిని గమనించి ఆ శునకాలను తరిమి కొట్టడంతో ఆ చిన్నారి తీవ్ర గాయాలతో తప్పించుకుని ప్రాణాలు నిలబెట్టుకుంది.
ఒక వేళ ఆ సమయానికి సదరు వ్యక్తి అటువైపు రాకుంటే ఆ వీధి శునకాల దాడికి మరో పసి ప్రాణం ప్రాణాలు విడిచేది, మరో కుటుంబం కడుపుకోతతో అల్లాడేది. గత నెలలో కూడా తెలంగాణ నిజమాబాద్ బాల్కొండకు చెందిన గడ్డం లక్షణ అనే 10 ఏళ్ళ చిన్నారి ఒంటరిగా వెళుతూ కుక్క కాటుకు గురై రేబిస్ వ్యాధిన పడి నెల రోజుల తరువాత ప్రాణాలు విడిచింది.
ఇలా ఒంటరిగా వీధులలో తిరగడానికి చిన్న పిల్లలే కాదు పెద్ద వారు సైతం భయపడుతున్న దృశ్యాలు, ఆ వీధి శునకాలు భయపెడుతున్న సంఘటనలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ దృశ్యాలు చూస్తుంటే ఈ శునకాల వేటకు ఇంకెంతమంది బలికావాలి.? ఇంకెంతమంది గాయపడాలి.? ప్రాణం పోయిన తరువాత ప్రభుత్వాలు ప్రకటించే ఎక్స్ గ్రేషియానో, సమాజం నుంచి వచ్చే సంతాప సందేశాలో ఆ కుటుంబానికి ఆ ప్రాణాన్ని తిరిగి అందించలేవు. ఇకనైనా ప్రభుత్వాలు నిద్ర లేచి సగటు మనిషి ప్రాణానికి రక్షణ కల్పించాల్సి ఉంటుంది.
రోడ్డు మీదకు వెళ్తే తప్ప తాగి ఒకడు హిట్ అండ్ రన్ చేసి పోతాడు, మరొకడు అత్యాచారం చేసి ప్రాణాలు తీస్తాడు, ఇంకొకడు నగదు కోసమో, నగలు కోసమో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటున్నాడు, ఇంకొకసు ప్రేమించలేదంటూ ప్రాణాలు లాగేసుకుంటున్నాడు,
లేదా రోడ్ యాక్సిడెంట్స్ తో రోజుకో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇప్పుడు వాటికీ తోడు ఇలా వీధి కుక్కలు కూడా ఒక సగటు మనిషి ప్రాణాన్ని హరిస్తే ఇక రోడ్లు భద్రమా.? వీధులు సురక్షితమా.? మనిషి ప్రాణానికి రక్షనెక్కడా.? అన్న ప్రశ్నలు తలెత్తుతాయి.







