సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన ప్రముఖ బిజెపి నేత సుబ్రమణియన్ స్వామి, ఈ సారి ‘యూనివర్సల్ స్టార్’ కమల్ హాసన్ పై దండెత్తారు. త్వరలో రాజకీయ ప్రవేశం చేస్తానని ఇటీవల కమల్ బహిరంగ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన స్వామి, “ఇతరుల కంటే తాను ఎంతో గొప్ప వ్యక్తి అని భావించుకునే ఇడియట్ కమలహాసన్ సీపీఎంలో చేరుతున్నట్టు విన్నాను!’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
‘ఇడియట్స్’ పార్టీలోకి మరో ‘ఇడియట్’ వెళ్తున్నాడని చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనాత్మకం కావడంతో, కమల్ అభిమానులు ఈ వ్యాఖ్యలపై కౌంటర్స్ ఇస్తున్నారు. ‘ఇతర పార్టీల్లో నుంచి బీజేపీలో చేరిన చాలామంది ఇడియట్స్ ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్నారు. అందరూ సమర్థత గల ఇడియట్స్’, ‘స్టాలిన్ ను బహిరంగంగా ఆరాధించడం కమల్ ఇప్పడే మొదలుపెట్టాడు!’,‘ ఆయన ఇష్టం ఏ పార్టీలో అయినా సరే, చేరవచ్చు. మీరెందుకు బాధపడుతున్నారు బ్రోకర్ స్వామి?’, ‘కమలహాసన్ పేరెత్తే అర్హత కూడా నీకు లేదు’ అంటూ మండిపడుతున్నారు.


