ఐపీఎల్ క్రేజ్ లో క్రికెట్ ప్రేమికులు, యువత మునిగి తేలుతున్నారు. బుధవారం నాడు హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కు చుక్కలు చూపించారు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్ మెన్లు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన హైదరాబాద్ బ్యాటింగ్ ఏకంగా ఐపీఎల్ ఆల్ టైం రికార్డును అధిగమించింది.
ఇప్పటివరకు జరిగిన 17 ఐపీఎల్ ట్రోఫీలలో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (263) నిలువగా, తాజాగా హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 277 పరుగులు సాధించి గత రికార్డులను ఘనంగా బద్దలు కొట్టింది. దీంతో సన్ రైజర్స్ ఫ్యాన్స్ పరుగుల వర్షంలో తడిసి ముద్దయ్యారు.
ప్రతి ఓవర్ హైలైట్స్ అనే విధంగా సాగిన బ్యాటింగ్ లో ఓపెనర్ హెడ్ (62), వన్ డౌన్ లో బరిలోకి దిగిన అభిషేక్ శర్మ (63) విధ్వంసం సృష్టించగా, దక్షిణాఫ్రికా ద్వయం క్లాసేన్ (80 నాటౌట్), మార్కరం (42 నాటౌట్)లు ఇన్నింగ్స్ ను ఆల్ టైం రికార్డులతో ముగించారు. ఈ నలుగురు అరవీర బ్యాటింగ్ ముందు ముంబై బౌలింగ్ అత్యంత దయనీయంగా మారిపోయింది.
అనుకోని విధంగా విరుచుకుపడిన ఈ సునామీ బ్యాటింగ్ వలన ముంబై తరపున బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా బౌలర్ల ద్వయం మఫాకా (66), కోయెట్జయే (57) అర్ధ సెంచరీలు నమోదు చేసుకోవడం విశేషం. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య తన 4 ఓవర్లలో అర్ధ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయారు.




