ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వివేకానంద రెడ్డి హత్య కేసుపై నాలుగేళ్ళ విచారణ తర్వాత కీలకదశకు చేరుకొన్నప్పుడు సుప్రీంకోర్టు ఆదేశం మేరకు సీబీఐ దర్యాప్తు బృందాన్ని మార్చక తప్పలేదు. ఇది వరకు ఈ బృందానికి రామ్‌సింగ్ నేతృత్వం వహిస్తుండగా ఇప్పుడు ఆయన స్థానంలో సీబీఐ డిఐజీ కెఆర్. చౌరాసియా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆయన బృందంలో ఎస్పీ వికాస్ సింగ్, అడిషనల్ ఎస్పీ ముఖేష్ సింగ్ తదితరులున్నారు. ఈ బృందానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపి ఏప్రిల్ 30వ తేదీలోగా ఈ కేసు విచారణను పూర్తిచేసి, ఈ కుట్రను చేదించి, వివేకా హంతకులను కనుగొనాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ కేసులో ఏ5 నిందితుడుగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వేసిన పిటిషన్‌తో ఈ మార్పులు జరిగాయని చెప్పవచ్చు. ఈ కేసు విచారణ చాలా ఆలస్యమైనందున తన భర్తకు బెయిల్ మంజూరు చేయాలనే ఆమె విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.
దాదాపు నాలుగేళ్ళుగా ఈ కేసు విచారణ ఏపీలో కొనసాగుతున్నప్పుడు సీబీఐ కూడా ధైర్యంగా దర్యాప్తు చేయలేని పరిస్థితులను ఎదుర్కొంది. అప్పుడే వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఈ కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేయించుకొన్నారు. అప్పటి నుంచే ఈ కేసు విచారణ వేగవంతం అయ్యింది. ఈ కేసులో ప్రధాన నిందితులలో ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని ఏ నిమిషంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ఆయన తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.
ఈ కేసు విచారణ తుది దశకు చేరుకొన్నప్పుడు హటాత్తుగా ఈ మార్పు జరుగడంతో కేసు విచారణ వేరే కోణంలో మొదలవవచ్చు. అదే కనుక జరిగితే దోషులు మారిపోయినా ఆశ్చర్యం లేదు. ఈ కేసులో సీబీఐ ఏవిదంగా ముందుకు సాగబోతున్నప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఏప్రిల్ 30వ తేదీలోగా ముగించాల్సి ఉంది కనుక ‘మమ’ అనిపించక తప్పదు.



