సుప్రీంకోర్టులో ఆమాద్మీ (సామాన్యుడు) పార్టీకి గొప్ప విజయం లభించింది. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతమే అయినప్పటికీ అదే దేశ రాజధాని కూడా కనుక అక్కడ శాంతిభద్రతలు, పోలీస్ వ్యవస్థ, భూమికి సంబందించిన వ్యవస్థలపై కార్యానిర్వాహక అధికారాలు కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. కానీ ఢిల్లీ ప్రభుత్వంలోని పాలనాపరమైన సర్వీసులన్నీ కూడా గవర్నర్ అధీనంలో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం 2015లో నోటిఫికేషన్ జారీ చేసింది.
బిజెపి యావత్ దేశాన్ని పాలిస్తున్నప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన ఆమాద్మీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వానికి కంట్లో నలుసులా ఉన్నారని భావిస్తోంది. కనుక ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ని అడ్డం పెట్టుకొని కేంద్రం ఆమాద్మీ ప్రభుత్వంపై పెత్తనం చేయాలని చిరకాలంగా ప్రయత్నిస్తోంది. 2015 నోటిఫికేషన్ ఆధారంగా తమ ప్రభుత్వంలో అన్ని శాఖల అధికారులను గవర్నర్ ద్వారా కేంద్రప్రభుత్వం తన గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుండటంతో, ఢిల్లీ ప్రభుత్వం దానిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
దానిపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సుదీర్గ విచారణ తర్వాత నేడు సంచలన తీర్పు చెప్పింది. ఫెడరల్ విధానంలోనే ప్రజాస్వామ్యం ఉంది. దాని ప్రకారం ప్రజలెన్నుకొన్న ప్రభుత్వానికే పాలనాధికారాలు అన్నీ ఉంటాయి. ఈ వ్యవస్థలో ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు జవాబుదారీగా ఉన్నట్లే, మంత్రులకు అధికారులు జవాబుదారీగా ఉంటారు. కనుక ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కోసం అధికారులు ప్రభుత్వాన్ని ధిక్కరిస్తే అది పాలనపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందువల్ల ఢిల్లీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలకు అధికారులు, లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడి ఉండాలి. అయితే పోలీస్ (శాంతి భద్రతలు) వ్యవస్థ లెఫ్టినెంట్ గవర్నర్ ఆధీనంలోనే ఉంటుంది,” అని సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు సంచలన తీర్పు చెప్పింది.
ఇదే సమయంలో సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు కూడా చెప్పింది. మహారాష్ట్రలోని శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ థాక్రే వర్గానికి, పార్టీ నుంచి వేరుపడి బిజెపి సాయంతో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక్‌నాథ్ షిండే వర్గానికి మద్య జరిగిన రాజకీయ ఆధిపత్యపోరులో మహారాష్ట్ర గవర్నర్ వేలుపెట్టి షిండే వర్గానికి అనుకూలంగా వ్యవహరించడాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పు పట్టింది. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండే గవర్నర్లు, రాజకీయపార్టీల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం వారిలో ఓ వర్గానికి మేలు చేకూర్చే ప్రయత్నం చేయడం సరికాదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. శివసేనలో రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడు ఉద్ధవ్ థాక్రే శాసనసభలో బలపరీక్షను ఎదుర్కొకుండా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినందున ఆయనను తిరిగి ముఖ్యమంత్రిగా నియమించలేమని, కనుక గవర్నర్ విచక్షణాధికారం మేరకు మెజార్టీ మద్దతు కలిగిన ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించడాన్ని తప్పు పట్టలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది.
ఈ రెండు తీర్పులు గవర్నర్‌లకు సంబందించినవి కావడం గమనార్హం. అలాగే రెండూ కూడా ప్రజా ప్రభుత్వాలని కూల్చివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలే కావడం గమనార్హం.
మొదటిదానిలో గవర్నర్‌ని అడ్డంపెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని ఆమాద్మీ ప్రభుత్వంపై పెత్తనం చేయాలని ప్రయత్నించగా, రెండో కేసులో ప్రజలెన్నుకొన్న శివసేన ప్రభుత్వంలో ఏక్‌నాథ్ షిండే అనే కట్టప్పను ప్రోత్సహించి ప్రభుత్వాన్ని కూలద్రోయిస్తూ దానికి గవర్నర్‌ని వాడుకొంది. సుప్రీంకోర్టు తాజాతీర్పు కేంద్ర ప్రభుత్వం చేతిలో గవర్నర్ వ్యవస్థ ఏవిదంగా దుర్వినియోగం అవుతోందో చాటిచెప్పిన్నట్లయింది.



