ఈ దసరాకు విడుదల కాబోతున్న రెండు సినిమాల పాటలు ఒక దానిని మించి మరొకటి ఉండేలా వినపడుతున్నాయి. “స్పైడర్” సినిమాకు సంబంధించి అయిదవ ట్రాక్ “అక్కడ ఉంటాడు”ను అభిమానుల కోసం సర్ ప్రైజింగ్ గా విడుదల చేస్తే, అదేమో కర్ణకఠోరంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా “జై లవకుశ”కు సంబంధించిన అయిదవ ట్రాక్ “స్వింగ్ జర”ను విడుదల చేయగా, ఇది అంతకుమించిన రేంజ్ లో వినపడుతోంది. దీంతో ఇవేమీ పాటలురా దేవుడా… అనుకోవడం శ్రోతల వంతవుతోంది.
బాలీవుడ్ సాంగ్ కు రీమిక్స్ చేసినట్లుగా వినపడుతున్న ఈ పాటలో మిల్కీ బ్యూటీ తమన్నా అందాలు హైలైట్ గా నిలవనున్నాయి. అలాగే ఎన్టీఆర్ మాస్ అభిమానులను సంతృప్తి పరిచే విధంగా మాస్ స్టెప్స్ అలరించే విధంగా కనపడుతున్నాయి. విజువల్ గా ఏమైనా చూడాల్సిందే తప్ప, ఆడియో పరంగా వినాలంటే… ఈ స్వింగ్ ను పక్కన పెట్టేస్తారని చెప్పడంలో సందేహం లేదు. సాధారణంగా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంలో పోటీ ఉంటుంది, కానీ ‘స్పైడర్, జై లవకుశ’ల విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా కనపడుతోంది.


