ఈ నెల 17న చిలకలూరిపేటలో టిడిపి, జనసేన, బీజేపీల ఉమ్మడి బహిరంగ సభలో మూడు పార్టీల అభ్యర్ధుల జాబితాలు ప్రకటించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తుండటంతో, ఒకరోజు ముందుగా అంటే మార్చి 16నే ఇడుపులపాయలో వైసీపి తుది జాబితా కూడా ప్రకటించేయాలని జగన్మోహన్ రెడ్డి సిద్దం అయ్యారు.
కానీ వైసీపి కంటే రెండు రోజుల ముందుగా అంటే రేపు గురువారమే టిడిపి రెండో జాబితా ప్రకటించబోతోంది. ఈ విషయం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు.
మూడు పార్టీల మద్య సీట్ల సర్దుబాట్లు కొలిక్కి వచ్చాయని, ఏ పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేస్తుందనే విషయం మూడు పార్టీలు ఇప్పటికే నిర్ణయించుకున్నాయని చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా జనసేన, బీజేపీలు తమ అభ్యర్ధుల పేర్లను ప్రకటించుకుంటాయని చెప్పారు. టిడిపి మాత్రం గురువారం రెండో జాబితాని ప్రకటించబోతోందని చెప్పారు.
మూడు పార్టీల మద్య కుదిరిన ఒప్పందం ప్రకారం… టిడిపి 17/144, జనసేన 2/21, బీజేపీ 6/10 ఎంపీ, అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయబోతున్నాయి.
వీటిలో టిడిపి ఇప్పటికే 94మంది ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటించింది. జనసేన 6 స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటించింది. బీజేపీ ఇంకా ప్రకటించవలసి ఉంది. బీజేపీ, జనసేనల మద్య ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల మార్పిడిపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అవి పూర్తయితే ఆ రెండు పార్టీలు కూడా తమ అభ్యర్దుల జాబితాలు ప్రకటించవచ్చు.
వైఎస్ షర్మిల రాకతో ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న ఏపీ కాంగ్రెస్ మాత్రం ఎన్నికలలో పోటీ చేస్తుందో లేదో చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఈసారి టిడిపి, జనసేన, బీజేపీలకు వైసీపికి మద్య హోరాహోరీగా పోరు జరుగబోతోంది. కనుక డబ్బు ఖర్చుపెట్టి ఎన్నికలలో పోటీ చేస్తే నష్టపోతామనే భయంతో కాంగ్రెస్ నేతలు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
బహుశః మూడు నాలుగు రోజులలో నాలుగు పార్టీల అభ్యర్ధులు, ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది కనుక ఇక అన్ని పార్టీలు యుద్ధానికి సిద్దం కాక తప్పదు.




