ఇంకా అభ్యర్థుల మార్పునా..? అన్ని పార్టీలది గందరగోళమేనా..?

TDP JSP YCP

అధికారం తోడైన అరాచకానికి – అభివృద్ధే అజెండాగా కూటమిగా ఏర్పడిన ప్రతిపక్షానికి… జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. మొన్నటి వరకు అధికారం అనుభవించిన పలువురు నేతలు, ఇక వైసీపీ అధికారంలోకి రాదన్న భావనతో టీడీపీ-జనసేన జెండాలు పట్టుకుని టిక్కెట్లు తెచ్చుకున్న వైనం తెలిసిందే.

అయితే గడిచిన అయిదేళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని తీవ్రంగా శ్రమించిన టీడీపీ – జనసేన స్థానిక నేతలకు టిక్కెట్లు లభించకపోవడంతో, వీరంతా ఓడిపోతుందని సర్వేలు తెలుపుతున్నా వైసీపీ జెండా పట్టుకుంటున్నారు. అటు – ఇటు రాకపోకలతో ఇప్పటికే సీట్లు ప్రకటించిన కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థుల మార్పులు అనివార్యం కాబోతున్నట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT

ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ దాదాపుగా 50 మందికి పైగా అభ్యర్థుల నియోజకవర్గాలను మార్చడంతో, పార్టీ కార్యకర్తలలో గందరగోళం నెలకొంది. దీనికి తోడు టీడీపీ – జనసేనలలో సీట్లు లభించని పోతిన వెంకట మహేష్ వంటి వారు కొత్తగా వైసీపీ కండువాలు కప్పుకోవడంతో, తాజాగా వారిని బరిలోకి దింపుతున్నట్లుగా మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేస్తున్నాయి.

అధికార పార్టీ తీరుతెన్నులు ఇలా ఉంటే, ప్రస్తుతం ప్రతిపక్షంలో కూటమిగా ఏర్పడిన మూడు పార్టీలలో బీజేపీ కోసం త్యాగాలు చేసిన టీడీపీ – జనసేన నేతలు కొందరు ఇంకా తమ ఆశావహ దృక్పధంతో పావులు కదుపుతున్నారు. దీంతో తిరుపతి వంటి ప్రధానమైన నగరాలలో అభ్యర్థుల మార్పు చేర్పులు జరగబోతున్నట్లుగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదిలా ఉంటే, మూడు పార్టీలు కూటమిగా ఏర్పాటు కావడానికి ప్రధాన కారణమైన రఘురామకృష్ణంరాజుకు ఇంకా సీటు కేటాయింపు జరగకపోవడం మింగుడు పడని అంశమే. నరసాపురం ఎంపీగా పోటీ చేయడానికి ఇంకా రాజు గారు తన రాజకీయ పావులు కదుపుతున్నారని తేలడంతో, నరసాపురం ఎంపీ అభ్యర్థి మార్పు అనివార్యం కాబోతోందా? అన్న ప్రశ్న లేవనెత్తుతోంది.

ఒకవేళ ఎంపీ కాకపోతే ఉండి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఆర్ఆర్ఆర్ పోటీ ఇప్పటికే ఖరారయ్యింది. మరో 48 గంటల్లో ఓ అధికారిక ప్రకటన వస్తుందని ఆర్ఆర్ఆర్ చెప్పి, 48 గంటలు గడిచినా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కూటమిగా ఏర్పడిన మూడు పార్టీలు నేడు సమావేశం అయినప్పటికీ, ఆర్ఆర్ఆర్ పోటీ చేయబోయే స్థానంపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

పోలింగ్ కు సరిగ్గా నెల రోజుల సమయం మిగిలి ఉండగా, ఇంకా అభ్యర్థుల మార్పు చేర్పులు జరుగుతుండడం అనేది సహజంగా జరిగే విషయం కాదు. కానీ ఈ సారి జంపింగ్ లు ఎక్కువగా ఉండడం, వైసీపీ నుండి సీటు లభించిన వారు కూడా చివరి నిముషంలో పోటీ నుండి తప్పుకోవడం, కూటమిలో ఉన్న అసంతృప్తి నేతల లుకలుకలు నేటి రాజకీయ పరిస్థితులకు ప్రధాన కారణాలుగా పేర్కొనవచ్చు. బహుశా మరో వారం రోజుల్లో ఈ అనిశ్చితి తొలగిపోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories