జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిని వైసీపి, దాని అనుకూల మీడియా విస్తృతంగా ప్రచారం చేసుకుంటుంటే, సీనియర్ టిడిపి నేతలందరూ కూడా రంగంలో దిగి అనేక ప్రశ్నలు సందించి జవాబులు చెప్పాలని నిలదీస్తున్నారు.
టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య ఈ ఘటనపై స్పందిస్తూ, “యస్! ఇది ప్రీ-ప్లాన్డ్ దాడే అని వైసీపి నేతల వాదనలతో అంగీకరిస్తున్నాను. ఆనాడు కోడికత్తి దాడి లాగే ఇది కూడా ప్రీ-ప్లాన్డ్ దాడే. ఆనాడు కోడికత్తి తన భుజానికి తాకబోతోందని జగన్‌కు ముందే తెలుసు. నిన్న నుదుటకు రాయి తాకబోతోందని కూడా జగన్‌కు ముందే తెలుసు.
ఓ వివేకా… ఓ కోడికత్తి… ఓ రాయి దాడులతో జగన్ అవసరమైతే ఒకరిని లేపేయడమే కాదు… తన మీద తానే దాడి చేయించుకోవడానికి కూడా వెనకాడరని పదేపదే నిరూపిస్తున్నారు.
వివేకా కేసుని చంద్రబాబు నాయుడితో ముడిపెట్టాలని విశ్వప్రయత్నాలు చేశారు. కానీ సొంత చెల్లెలే జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డిలను వేలెత్తి చూపిస్తోంది.
కోడికత్తి కేసులో కూడా చంద్రబాబు నాయుడే చేయించారని నిరూపించాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఓ నిరుపేద దళితుడిని 5 ఏళ్ళు జైలులో మగ్గిపోయేలా చేశారు.
ఇప్పుడు ఈ రాయి దాడి కేసులో మరో అమాయకుడు బలికాబోతున్నాడు. నేడో రేపో ఎవరో అమాయకుడిని పట్టుకొని వచ్చి తన చేత చంద్రబాబు నాయుడు రాయి విసిరించారని చెప్పించకుండా ఉండరు.
ఒకవేళ తనపై చంద్రబాబు నాయుడే ఈ దాడి చేయించారని జగన్, వైసీపి నేతలు అందరూ గట్టిగా నమ్ముతున్నట్లయితే ఈ కేసుని వెంటనే సీబీఐకి అప్పగించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. లేకుంటే కోడికత్తిలా ఎన్నికలలో వాడుకొని పక్కన పడేస్తారు.
నేను వైసీపి నేతలనీ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. దమ్ముంటే వాటికి సూటిగా సమాధానాలు చెప్పాలి. జగన్‌పై దాడి జరిగిన పది నిమిషాలకే వైసీపి నేతల చేతుల్లో జగన్‌పై హత్యాయత్నం అంటూ ప్లకార్డులు ఎలా వచ్చాయి?పది నిమిషాలలోనే ఈవిషయం వైసీపి నేతలందరికీ ఎలా తెలిసిపోయింది?వారందరూ వెంటనే సోషల్ మీడియాలో ఎలా మాట్లాడేశారు? ఒకవేళ వారు కాదంటే దీనికి డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి, ఇంటలిజన్స్ డీజీ సీతారామాంజనేయులు బాధ్యులను చేసి వారిపై చర్యలు తీసుకోగలరా?
కనుక ఇది పక్కగా వైసీపి మేధావులు రచించి రక్తి కట్టించిన ప్రీ-ప్లాన్డ్ స్టేజి డ్రామా మాత్రమే. ఎన్నికలలో డబ్బులు, మద్యం పంచి ఓటర్లను ప్రభావితం చేసిన్నట్లుగానే, ఈ కోడికత్తి, రాళ్ళ దాడులతో కూడా ఓటర్లను ప్రభావితం చేయాలని వైసీపి ప్రయత్నిస్తోందని మేము భావిస్తున్నాము.
కనుక ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మేము (టిడిపి) కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు, కేంద్ర ఎన్నికల కమీషన్‌కు లేఖలు వ్రాయబోతున్నాము,” అని వర్ల రామయ్య స్పష్టం చేశారు.




