జగన్‌పై టిడిపి దాడి చేయిస్తే నష్టపోయేది టిడిపియే కదా?

Stone Hurled At CM Jagan

ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డిపై నిన్న రాత్రి విజయవాడలో జరిగిన దాడిపై అప్పుడే అధికార, ప్రతిపక్షాల మద్య రాజకీయ యుద్దాలు ప్రారంభం అయ్యాయి.

జగన్మోహన్‌ రెడ్డిని అడ్డుతొలగించుకునేందుకు చంద్రబాబు నాయుడే దాడి చేయించారని వైసీపి నేతలు, వారి ఆత్మసాక్షి తీర్మానించేసింది.

ADVERTISEMENT

ఈ దాడిని వైసీపి తమకు అనుకూలంగా మలుచుకొని ప్రజల సానుభూతి ఓట్లు సంపాదించుకోవాలని ప్రయత్నిస్తోందని, టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కోడికత్తిలో నిందితుడిని వెంటనే పట్టుకొన్నారని కానీ జగన్‌ చుట్టూ ఇంతమంది పోలీసులు ఉన్నా ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. కనుక ఇది ఖచ్చితంగా కోడికత్తి 2.0 వెర్షనే అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

టిడిపి, వైసీపిల ఈ వాదనలను విన్నప్పుడు ఒకవేళ టిడిపి ఆయనపై దాడి చేయించి ఉంటే వైసీపికే సానుకూలంగా మారుతుందని, టిడిపి నష్టపోతుందని అర్దమవుతోంది. ఇది తెలిసీ టిడిపి ఇటువంటి పని చేస్తుందనుకోవడం అర్ధరహితమే. కానీ జగన్‌పైకి రాయి విసిరిన వ్యక్తి ఎవరో తెలుసుకోకుండానే చంద్రబాబు నాయుడే ఈ పని చేయించారని వైసీపి దుష్ప్రచారం చేస్తుండటాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు.

జగన్‌ భద్రత కోసం ఇంతమందిని పెట్టుకొని, వందల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ, ఆయనపై దాడి జరగడం ఖచ్చితంగా భద్రతా వైఫల్యమే అని దీనికి డిజిపి బాధ్యత వహించాలని టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమ అన్నారు.

ముఖ్యమంత్రి నిన్న రాత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నప్పుడు, పదేపదే విద్యుత్ సరఫరా ఎందుకు నిలిపివేశారని దేవినేని ఉమా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చీకటి ప్రదేశంలో ఉన్నప్పుడు ఆయనపై ఇటువంటి దాడులు జరుగకుండా ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని దేవినేని ఉమా ప్రశ్నించారు.

ఓ ఎన్నికల సభలో ముఖ్యమంత్రిపై ఎవరైనా రాయితో ఇంత సులువుగా దాడి చేయగలిగినప్పుడు, ఇంత మంది పోలీసులు, భద్రతా సిబ్బంది ఉండి ఏం ప్రయోజనమని దేవినేని ప్రశ్నించారు.

జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తాడేపల్లి ప్యాలస్‌ నుంచి ఎప్పుడు బయటకు వచ్చినా దారి పొడవునా పరదాలు కట్టి, బ్యారికేడ్లతో ప్రజలను దూరంగా ఉంచుతూ, చుట్టుపక్కల పచ్చటి చెట్లను నరికించేస్తున్నారు. ఇంతకాలం ఇన్ని జాగ్రత్తలు తీసుకొని జగన్‌పై ఈగ కూడా వాలకుండా జాగ్రత్తలు తీసుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఎందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు?అని టిడిపి సీనియర్ నేత బోండా ఉమా ప్రశ్నించారు.

జగన్‌పై దాడి జరిగితే చుట్టూ ఉన్న వందలాది పోలీసులు దాడి చేసిన వ్యక్తిని వెంటనే ఎందుకు పట్టుకోలేదు? ఇదంతా చూస్తే ఎన్నికల కోసం ఐప్యాక్ రచించి రక్తి కట్టించిన డ్రామాలాగే ఉందని బోండా ఉమా అన్నారు. కోడికత్తి డ్రామా ఒకసారి ఫలిస్తుంది కానీ ప్రతీసారి ఇటువంటి డ్రామాలతో ప్రజలను నమ్మించలేరని అన్నారు. వైసీపి ఎన్ని డ్రామాలు ఆడినప్పటికీ ఈ ఎన్నికలలో ఓటమి తప్పదని బోండా ఉమా అన్నారు.

ఈ ఘటనపై టిడిపి, వైసీపిల వాదనలను రాష్ట్ర ప్రజలందరూ వింటున్నారు. కనుక ఎన్నికలలో వారే తీర్పు చెపుతారు. కానీ అంతకంటే ముందు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై ఎవరు ఎందుకు దాడి చేశారనే విషయం కనిపెట్టడం, మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

ADVERTISEMENT
Latest Stories