తెలుగుదేశంతో పోటీ పడాలంటే తెలుగు దేశంలా కష్టపడాలి!

TDP MLC Electionsఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి అభ్యర్ధులు గెలుగు గుర్రాలలాగ విజయపధంలో దూసుకుపోతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికలలో 175 సీట్లు మావేనని అతిశయం ప్రదర్శించిన వైసీపీ అధినేతతో సహా ఆ పార్టీ నేతలందరూ ఈ ఫలితాలు చూసి షాక్ అవుతున్నారు. ‘టార్గెట్ కుప్పం’ అంటూ ప్రగల్భాలు పలికిన వైసీపీ అధినేతకి ఆయన కంచుకోట పులివెందులలోనే పట్టభద్రులు షాక్ ఇస్తున్నారు.

అయితే ఈ ఫలితాలు, విజయం యాదృచ్ఛికంగా వచ్చినవి కావు. గత ఎన్నికలలో టిడిపి ఓడిపోయిన తర్వాత వైసీపీ నుంచి నిత్యం సవాళ్ళు, సమస్యలు, వేధింపులు, కేసులు ఎదుర్కొంటూనే ఉంది. పార్టీలో నుంచి కొంతమంది అవకాశవాదులు వేరే పార్టీలలోకి వెళ్ళిపోయారు. అయినప్పటికీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అచ్చన్నాయుడు, నారా లోకేష్‌ తదితర ముఖ్య నేతలందరూ రేయింబవళ్ళు శ్రమిస్తూ పార్టీని కాపాడుకొంటూ, బలోపేతం చేసుకొన్నారు.

ADVERTISEMENT

ఇంత వయసులో కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూనే ఉన్నారు. నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర చేస్తున్నారు. ఎక్కడికక్కడ టిడిపి నేతలు ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉన్నారు. కనుక ఈ మూడున్నరేళ్ళుగా పార్టీ నేతలు, కార్యకర్తలందరి సమిష్టి కృషి, పట్టుదల, వారి పోరాటస్పూర్తి వలననే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి అభ్యర్ధులు గెలవబోతున్నారనేది సుస్పష్టం.

అయితే జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనీయవద్దని, అందరూ టిడిపికే మద్దతు ఈయాలని గట్టిగా చెప్పడం వలననే జనసేన ఓట్లు టిడిపికి పడ్డాయని, అందుకే గెలవబోతున్నారని సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు చెప్పుకొంటున్నారు.

టిడిపి ఇంతగా చెమటోడ్చుతుంటే, నెలకో రెండు నెలలకో ఓసారి మాత్రమే వచ్చి హడావుడి చేసి వెళ్లిపోయే పవన్‌ కళ్యాణ్‌ సిఫార్సు చేస్తే తప్ప గెలవలేని దుస్థితిలో టిడిపి ఉందా?అంటే కాదనే అందరికీ తెలుసు. తొమ్మిదేళ్లు రాజకీయాలలో నలిగిన తర్వాత కూడా పవన్‌ కళ్యాణ్‌ మొన్న మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావసభలో కులాల గురించి, తన సినిమా ఆదాయం గురించి మాట్లాడి అపరిపక్వతను చాటుకొన్నారని వైసీపీ నేతలే కాదు… రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు.

ఇక కార్యకర్తల విషయానికి వస్తే టిడిపి కార్యకర్తల పూర్తి ఫోకస్ తమ పార్టీ మీదనే పెట్టి శ్రమిస్తున్నారు. నిజానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టిడిపి కార్యకర్తల కష్టార్జితమే… కనుక ఈ క్రెడిట్ వారిదే అని చెప్పక తప్పదు. అదే… జనసేన కార్యకర్తలుగా చెప్పుకొంటున్న పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు పార్టీ కోసం ఏమి చేస్తున్నారో తెలీదు కానీ ఎప్పుడూ సినిమాలు, హీరోలు, కలక్షన్స్‌, కులాల గొడవలతో కాలక్షేపం చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

ఎప్పటికైనా ఏపీలో జనసేన అధికారంలోకి రావాలన్నా, పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి కావాలన్నా టిడిపి నేతలు, కార్యకర్తలు ఎంతగా చెమటోడ్చుతున్నారో, ఎన్ని త్యాగాలు చేస్తున్నారో, ఎంత పట్టుదల, పోరాట స్పూర్తి కలిగి ఉన్నారో అంత ఉందాలి. పవన్‌ కళ్యాణ్‌ ఇమేజ్‌ లేదా ఓ కులం మద్దతుతో అధికారంలోకి వచ్చేయవచ్చని భ్రమలో ఉంటే ఎప్పటికీ ఆ భ్రమలోనే ఉండిపోయే ప్రమాదం ఉంటుంది.

జనసేన తొమ్మిదేళ్ళు రాజకీయాలలో ఉందంటే అది పవన్‌ కళ్యాణ్‌ కష్టార్జితంతోనే అని అందరికీ తెలుసు. కానీ ఎల్లకాలం అది సాధ్యం కాదనే విషయం జనసైనికులు గ్రహిస్తే వారు కూడా టిడిపి కార్యకర్తలలాగా సుసిక్షుతులైన సైనికులులాగా పనిచేస్తూ జనసేన తన కాళ్ళ మీద తాను నిలబడేలా చేసుకొంటారు. ముఖ్యంగా టిడిపితో కలిసి ఈసారి ఎలాగైనా శాసనసభలో అడుగుపెట్టాలని పవన్‌ కళ్యాణ్‌ చెపుతున్నప్పుడు, జనసేనలో అందరూ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడం అలవరుచుకోవాలి. అప్పుడే రాజకీయాలలో జనసేన రాణించగలదు.

ADVERTISEMENT
Latest Stories