పట్టరా పట్టు… మరొక్క ఎమ్మెల్సీ సీటు సాధిద్దాం!

TDP_and_YSRCPనేడు ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలలో వైసీపీకి 151 మంది, టిడిపికి 23, జనసేనకు ఒక్క శాసనసభ్యులు ఉన్నారు.

ADVERTISEMENT

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గుడ్ బై చెప్పగా, మరో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి దూరంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికలలో టికెట్‌ లభించదని భావిస్తున్న అసంతృప్త ఎమ్మెల్యేలు ఓ పదిమంది వరకు ఉన్నట్లు సమాచారం. అదేవిదంగా టిడిపికి చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. జనసేన ఎమ్మెల్యే వైసీపీతో కొనసాగుతున్నారు.

ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్ధి గెలుపుకి 22 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. వైసీపీకి సరిపడా ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక 7 మంది అభ్యర్ధులను బరిలో దింపింది. టిడిపికి ఒక ఎమ్మెల్సీని గెలిపించుకొనేందుకు మరో 4-5 ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది.

ఈ ఎన్నికలలో ఏ పార్టీ కూడా తమ అభ్యర్ధులకు మాత్రమే ఓట్లు వేయాలని ఆదేశిస్తూ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయడానికి వీలులేదు కనుక వైసీపీలో అసంతృప్త ఎమ్మెల్యేలు తప్పకుండా తమ అభ్యర్ధికి ఓట్లు వేస్తారనే నమ్మకంతో టిడిపి ఒక అభ్యర్ధిని బరిలో దింపింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే ఆత్మప్రభోదానుసారం ఓటు వేస్తానని ప్రకటించారు. అంటే టిడిపికి వేస్తానని చెప్పకనే చెప్పేశారు. ఆనం రామనారాయణ రెడ్డి ఓటు కూడా టిడిపికే పడటం ఖాయం. ఇంకా ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత వంటి అసంతృప్త ఎమ్మెల్యేలు వైసీపీలో మరికొందరున్నారు. వారిలో కొందరు ఇప్పటికే టిడిపితో టచ్‌లో ఉన్నారు. కనుక వారి మద్దతుతో తమ ఎమ్మెల్సీ అభ్యర్ధిని గెలిపించుకోగలమని టిడిపి ధీమాగా ఉంది.

పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి మూడు స్థానాలను గెలుచుకొని వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యేల కోటాలో కూడా మరో సీటును ఎలాగైనా గెలుచుకోవాలని టిడిపి చాలా పట్టుదలగా ఉంది. దీని కోసం టిడిపి నేతలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఒకవేళ ఈ ఎన్నికలలో కూడా టిడిపి తన అభ్యర్ధిని గెలిపించుకోగలిగితే ఇది వైసీపీకి మరో పెద్ద షాక్ అవుతుంది. కనుక ఇంతకాలం పట్టించుకోని అసంతృప్త ఎమ్మెల్యేలను వైసీపీ నేతలు బుజ్జగిస్తున్నారు. కానీ ఈ బుజ్జగింపులు ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ ఓట్ల కోసమే అని వారికీ తెలుసు. కనుక బుజ్జగింపులు పనిచేయకపోవచ్చు.

గురువారం ఉదయం శాసనసభలోని కమిటీ హాల్ నంబర్:1లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. కనుక 7 ఎమ్మెల్సీ స్థానాలలో టిడిపి ఆశిస్తున్న ఒక సీటుని వైసీపీ దక్కించుకొంటుందా లేక టిడిపియే గెలుచుకొంటుందా అనేది ఈరోజు సాయంత్రానికి తేలిపోతుంది. అంతవరకు వైసీపీకి గుబులు తప్పదు.

ADVERTISEMENT
Latest Stories