ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అన్న విడాకుల వార్త నేడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా సోషల్ మీడియాలో కూడా విస్తృత చర్చనీయాంశంగా మారిపోయింది. పవన్ అభిమానులు ఆయన విడాకుల వార్తతో షాక్ కు గురయ్యారనే చెప్పాలి.
తమ అభిమాన హీరో, నాయకుడి వ్యక్తిగత జీవితాతంలో వచ్చిన ఈ పెను మార్పును వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక పక్క పవన్ వ్యక్తిగత జీవితంలో మరోమారు తలెత్తిన అలజడికి తోడు ఇటు సోషల్ మీడియాలో పవన్ పై ఆయన రాజకీయ ప్రత్యర్థులు చేసే ట్రోలింగ్ తలుచుకుని పవన్ అభిమానులు మరింత కంగారుపడ్డారనే చెప్పాలి.
అయితే ముందుగా అధికార టీడీపీ తన తరుపు నుంచి తన పార్టీ శ్రేణులకు, శ్రేయోభిలాషులకు క్లియర్ కట్ సందేశం ఇచ్చింది. మిత్రపక్ష పార్టీల నాయకులతో పాటుగా ప్రత్యర్థి పార్టీ నాయకులతో సహా ఎవరి వ్యక్తిగత విషయాల పై ఎటువంటి అనుచిత వ్యాఖ్యలను పార్టీ సహించబోదని ఐటీడీపీ తేల్చి చెప్పింది.
ఐటీడీపీ తో అనుబంధంగా ఉన్న ఖాతాల నుంచి కూడా వ్యక్తుల వ్యక్తిగత విషయాల మీద పోస్ట్ లు పెట్టినా, ఆ పోస్టులకు అనుచితంగా స్పందించిన పార్టీ క్రమశిక్షణ చర్యలకు వెనుకాడదు అనే స్పష్టమైన ఆదేశాలు టీడీపీ నుంచి వ్యక్తమయ్యాయి.
అయితే గత కొన్నేళ్లుగా ముఖ్యంగా వైసీపీ పవన్ మూడు పెళ్లిళ్ల విషయాన్ని ఎంతలా హై లైట్ చేసి దాన్ని తమ రాజకీయ విమర్శలకు అస్త్రంగా మలిచిందో అందరు చూసారు, విన్నారు కూడా. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి పవన్ విడాకుల వార్తను వైసీపీ ఇంకెంత బలంగా రాజకీయాలలో వినియోగిస్తుందో.? పవన్ వ్యక్తిగత జీవితం టార్గెట్ గా ఇంకెన్ని అస్త్రాలను ప్రయోగిస్తుందో అన్న వారి ఆలోచనలకు కూడా నేడు వైసీపీ ఊహించని షాక్ ఇచ్చిందనే చెప్పాలి.
పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులు రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాలకు సంబంధించిన అంశాల మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయడం, అలాంటి కంటెంట్ ను షేర్ చెయ్యడం మానుకోవాలని పార్టీ కేంద్ర కార్యాలయం విజ్ఞప్తి చేస్తుంది అంటూ వైసీపీ తన పార్టీ శ్రేణులకు ఒక స్పష్టమైన సంకేతాలు పంపించింది.
వ్యక్తుల వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని, బహిరంగ వేదికల పై మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని, సోషల్ మీడియా వేదికల్లో సంబంధిత చర్చల్లో పాల్గొనడం, పోస్టులకు స్పందించడం నివారించాలని రాజకీయాలలో బాధ్యతగా
వ్యహరించాయాలంటూ వైసీపీ తన పార్టీ శ్రేణులకు సూచనలు చేసింది.
వైసీపీ నుంచి ఈ రకమైన స్పందన జనసైనికులతో పాటుగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి. రాజకీయాల్లో ఈ స్థాయి హుందాతనం అనివార్యం అన్న యదార్ధం ఇప్పటికైనా వైసీపీ గ్రహించడం శుభపరిణామం గానే భావించాలి.
అయితే ఎప్పుడు తూర్పు – పడమర మాదిరి భిన్న ధ్రువాలుగా ఉండే టీడీపీ, వైసీపీ ఈ విషయంలో ఒక్కటవ్వడం, తమ పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం నిజంగా ఏపీ రాజకీయ చరిత్రలో మరోకొత్త అధ్యాయానికి నాంది పలకడమే అవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
రాజకీయ నాయకుల విమర్శల్లో వైరం ఉండొచ్చు, విధానాల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, సిద్ధాంతాల వియషంలో బేషజాలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగత గౌరవం విషయంలో అందరి మధ్యన ఏకాభిప్రాయం ఉండాలి. ఈ విషయంలో టీడీపీ, వైసీపీ లు వ్యక్తం చేసిన ‘నో’ కేవలం ఒక నిర్ణయం మాత్రమే కాకుండా రాజకీయ విమర్శలకు కూడా హద్దులు ఉండాలనే చెప్పే ఒక గొప్ప రాజకీయ సందేశంగా నిలవనుంది.
మరి ఈ ఇరుపార్టీల నేతలు ఒక్కటై తీసుకున్న ఈ నిర్ణయం క్షేత్ర స్థాయిలో ఎలా అమలవుతుందో.? సోషల్ మీడియా విచ్చలవిడి స్వేచ్చకు ఎలా ఆనకట్టగా నిలుస్తుందో రానున్న రోజుల్లో తేలనుంది…! అప్పటి వరకు టీడీపీ, వైసీపీ ల ‘నో’ రియాక్షన్ కు ‘ఎస్’ చెప్పడమే…







