టి. బీజేపీ కి కాంగ్రెస్ – బిఆర్ఎస్ గ్రహణం వీడేదెప్పుడు.?

Telangana BJP amid Congress BRS politics

దేశంలో వరుసగా మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మహామహా రాజకీయ ఉద్దండులను సైతం మట్టికరిపించి ఆయా రాష్ట్రాలలో కాషాయ జెండా ఎగరేయగలుగుతున్న బీజేపీ దక్షిణాదిన మాత్రం కమలాన్ని వికసింపచేయలేకపోతుంది.

ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ మీద ప్రత్యేక శ్రద్ద పెట్టిన బీజేపీ అందుకు తగ్గట్టుగా తన రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతుందా.? తెలంగాణ రాజకీయాలలో బీజేపీ అప్పటి నుంచి ఇప్పటికి ఎదో ఒక పార్టీకి బినామీ పార్టీగానే విమర్శలు ఎదుర్కొంటుంది.

ADVERTISEMENT

కాంగ్రెస్ పార్టీ బీజేపీ, బిఆర్ఎస్ ల మధ్య అంతర్గత సంబంధాలు ఉన్నాయని, ఆ రెండు పార్టీలు అనధికారిక రాజకీయ పొత్తులు పాటిస్తున్నాయని, వారిద్దరి లక్ష్యం కాంగ్రెస్ ఓటమే అంటూ బీజేపీ పార్టీని బిఆర్ఎస్ తో కలిపిముడిపెడుతుంది. అందుకు ఆధారాలుగా హరీష్ రావు – బీజేపీ ల మధ్య బంధం ఉందని, ఎదోకరోజు హరీష్ బిఆర్ఎస్ ను బీజేపీ కి చేరువ చేస్తారని, అందుకు కేసీఆర్ కుమార్తె కవిత హరీష్, బీజేపీ టార్గెట్ గా చేస్తున్న ఆరోపణలను తెరమీదకు తెస్తున్నారు.

ఇక బిఆర్ఎస్ కూడా రాజకీయంగా ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీ లను మిత్ర పక్షాలుగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నాయకత్వానికి బీజేపీ కేంద్ర స్థాయి నాయకులకు మధ్య మంచి తత్సబంధాలు కొనసాగుతున్నాయని టి.బీజేపీ ని కొందరు నాయకులు కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మగా మారుస్తున్నారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ – తెలంగాణ సీఎం రేవంత్ మధ్య ఉన్న బంధాలే అందుకు ప్రత్యక్ష సాక్ష్యులు అంటూ వాదిస్తున్నారు.

అయితే రాజకీయాలలో పార్టీల మీద ఇటువంటి విమర్శలు సర్వసాధారణం. అయితే ఒక పార్టీ మరోపార్టీతో తెరచాటు రాజకీయం చేయడం కూడా కొత్తేమి కాదు. కానీ ఇక్కడ ఒక్క పార్టీ రెండు పార్టీలతో తెరచాటు ఒప్పందాలు పెట్టుకుంటుంది అనే ఆరోపణలే బీజేపీ ని సగం బలహీనపరుస్తుంది.

అసలు టి. బీజేపీ రాజకీయ వైఖరి ఏంటి.? టి. బీజేపీ ప్రధమ రాజకీయ ప్రత్యర్థి ఎవరు.? బీజేపీ కి బిఆర్ఎస్ మధ్య ఉన్న రాజకీయ దూరమెంత.? కాంగ్రెస్ కి టి.బీజేపీ కి మధ్య రాజకీయ వైరం ఎంత.? టి. బీజేపీ కి ఈ కాంగ్రెస్, బిఆర్ఎస్ గ్రహణం వీడేదెప్పుడు.? అనే అనేక విషయాలలో ఇప్పటికి టి. బీజేపీ శ్రేణులు ఆ పార్టీ క్యాడెర్ కి ఒక స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.

కాంగ్రెస్, బిఆర్ఎస్ మూకుమ్మడిగా టి. బీజేపీ పై చేస్తున్న ఈ ఆరోపణలు, విమర్శలు తెలంగాణలో బీజేపీ పార్టీ ఎదుగుదలకు కంచెగా మారుతున్నాయి అనేది బీజేపీ అధిష్టానం ఇంకెప్పటికీ గ్రహిస్తుంది.

ఏపీలో టీడీపీ, జనసేనతో ఉన్న పొత్తును కూడా కాదని ఒంటరి పోరాటానికి సై అంటున్న టి.బీజేపీ కాంగ్రెస్, బిఆర్ఎస్ ల రాజకీయ పద్మవ్యూహంలో ఎప్పటికి అభిమన్యుడి పాత్రలోనే ఉండిపోతుందా.? లేదా అర్జునుడిలా వ్యూహాన్ని ఛేదించి జయకేతనం ఎగరవేయగలుగుతుందా.?

ADVERTISEMENT
Latest Stories