KCR on Opposition Partyదేశ ప్రగతిలో పాలక పక్షాల తీరు ఎంత ముఖ్యమో ప్రతిపక్షాల పాత్ర కూడా అంటే ముఖ్యం. ప్రతిపక్షాలు ఎంత బలంగా ఉంటే పాలక పక్షం అంత బాధ్యతగా ఉంటుంది అనేది యదార్ధం. కానీ నేటి రాజకీయాలలో రాను రాను ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే పనిలో ప్రభుత్వాలు ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారనేది బహిరంగ సత్యమే.

అటు దేశ రాజకీయాలు చూసినా.., ఇటు రాష్ట్ర రాజకీయాలు చూసినా “ఎందెందు వెతికినా అందందే” అన్న చందంగా మారింది ప్రభుత్వాల వ్యవహార శైలి. గత ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఆలోచనలే చేసి ఉంటే, ఇప్పుడు ప్రభుత్వాలను ఏర్పాటు చేసే స్థాయికి ప్రస్తుత అధికార పార్టీలు ఎదిగి ఉండేవా?అని ఆత్మ సాక్షిగా ప్రశ్నించుకోవాలనేది నేటి ప్రతిపక్ష పార్టీల మనోవేదన.

దేశ రాజకీయాలలో ఏకఛత్రాధిపత్యం కోసం పరితపిస్తున్న బీజేపీ కానీ.., రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్న టీఆర్ఎస్, వైసీపీలు కానీ తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటివంటి పోకడలను ఎద్దేవా చేసిన వారే. కానీ తాము అధికారంలోకి రాగానే కక్ష సాధింపులలో భాగంగా కేసులతో బెదిరించేవారు ఒకరు.., అధికారంతో అణిచివేసేది మరొకరు అన్న చందంగా ఒకరిని మించి మరొకరు తమ ఆధిపత్యాన్ని జుళిపిస్తూనే ఉన్నారు.

“ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విలువలు మాట్లాడి, అధికారంలోకి వచ్చాక విచ్ఛిన్నాల గురించి మాట్లాడడం తప్పు” అనేది రాజకీయ విశ్లేషకుల మాట. కానీ నేటితరం రాజకీయ క్రీడలను చూస్తుంటే సగటు ఓటరుకు జుగుప్స కలగక మానదు. తాము ఓటు వేసి ఎన్నుకున్న నేత రేపు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియని అయోమయంలో ఉంటున్నారు సామాన్య ఓటరు. దీనికి కారణం ఎవరు..? ఓటు వేసిన ఓటరుదా.? పోటీ చేసే అవకాశం కల్పించిన పార్టీదా..? లేక గెలిచిన నేతను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్న నాయకులదా..? అనే ప్రశ్నకు సమాధానం మాత్రం కరువైందనేది ప్రజాస్వామ్యవాదుల ఆవేదన.

ఏది ఏమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో సామాన్యుడుకి సరైన న్యాయం జరగాలి అంటే పాలక పక్షంతో ధీటుగా ప్రతిపక్షాలు పని చేయాలి. దీనికి ఉదాహరణ మొన్న తెలంగాణ అసెంబ్లీలో ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటనే. కేసీఆర్ ప్రభుత్వం స్థాపించిన నాటి నుండి తన ప్రధమ కర్తవ్యం ప్రతిపక్షాల అణిచివేతే అన్న తీరుగా నడుచుకున్నారు. అందులో భాగంగానే టీడీపీ పార్టీని తెలంగాణాలో కనుమరుగు చేశారు.

ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలన్నీ కొత్తగా జవసత్వాలు నింపుకొని అధికార పార్టీపై ముప్పేట దాడి చేస్తున్నాయి. దాని ఫలితమే గత 7 సంవత్సరాలుగా ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ప్రస్తుతం ప్రతి రోజూ తానే స్వయంగా మీడియా ముందుకు వచ్చి మరీ ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పికొడుతున్నారు. ప్రతిపక్షాలు బలంగా ఉంటేనే ప్రభుత్వాలు బాధ్యతగా ఉంటాయనే దానికి నిలువెత్తు నిదర్శనమే మారిన కేసీఆర్ తీరు.

ప్రతిపక్షాలు అందరూ కలసి ఒత్తిడి చేస్తే ఎంత మెజారిటీ సాధించిన గవర్మెంట్ అయినా దిగి రాక తప్పదు, తద్వారా మేలు జరిగేది సామాన్యుడికి. అయితే ప్రతిపక్షాలు కూడా కొంత బాధ్యతగా రాజకీయం చేయాలి. తమ తమ రాజకీయ క్రీడల్లో సామాన్యుడు నలిగిపోకుండా చూడడం ప్రభుత్వానికే కాదు, ప్రతిపక్షలా బాధ్యతగా గుర్తించి మెసులుకోవాలి.