తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ చెప్పిన కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకప్పుడు మావోయిస్టుల కదలికలను అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా పనిచేసిన గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీ వంటి ప్రత్యేక విభాగాలను ఇప్పుడు డ్రగ్స్, సైబర్ నేరాలు, ఆహార కల్తీ వంటి కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి ఉపయోగించుకోబోతున్నామని తెలిపారు.
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సమస్యను కూకటివేళ్లతో పెకలించేందుకు అందుబాటులోకి వచ్చిన ఈ అదనపు బలగాలను వినియోగించుకుంటామని చెప్పారు. ఇప్పటికే హోటళ్లలో ఆహార కల్తీని కట్టడి చేసేందుకు వంద మందితో టి-సేఫ్ అనే ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మాదకద్రవ్యాల కట్టడికి కూడా ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
మారిన పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థలో అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలనుకోవడం మంచి ఆలోచనే. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఆలోచనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పరిగణనలోకి తీసుకుంటే మంచిదే.
ముఖ్యంగా గంజాయి సాగు, రవాణాకు అడ్డాగా మారిన ఒడిశాతో సరిహద్దు పంచుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌లో వాటి కట్టడికి మరింత పోలీసు బలగం అవసరం ఉంటుంది. గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా పనిచేసిన ఏపీ పోలీసు సిబ్బందిని ఇప్పుడు ఇటువంటి నేరాల నియంత్రణకు వినియోగించుకోగలిగితే ప్రభుత్వంపై అదనపు భారం కూడా పడదు.
అలాగే సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల కట్టడికి పోలీసులకు మరింత సాంకేతిక పరిజ్ఞానం అవసరం. మావోయిస్టుల కట్టడి కోసం పనిచేసిన పోలీసులకు వీటిపై తగిన శిక్షణ ఇప్పించి వారి సేవలను వినియోగించుకుంటే మంచిదే కదా?
పాత సవాళ్ల కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బందిని కొత్త సవాళ్లను ఎదుర్కొనే విధంగా మార్చడం అంత సులభం కాకపోవచ్చు. కానీ అసాధ్యం మాత్రం కాదు. తెలంగాణ డీజీపీ ఆలోచనల్లోనే దీనికి సమాధానం కనిపిస్తోంది. పరిస్థితులు మారినప్పుడు పోలీసింగ్ కూడా మారాలి. అందుబాటులో ఉన్న బలగాలను కొత్త నేరాలపై సమర్థంగా ఉపయోగించుకోవడం ఆ దిశగా మంచి అడుగే అవుతుంది.




