జనసేన పార్టీ గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పోటీ చెయ్యలేదు. అనుకోకుండా వచ్చిన ఎన్నికలకు మేము సరిగ్గా సన్నధం కాలేకపోయాము అని పవన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో మాత్రం కొన్ని స్థానాలలో తన అభ్యర్థులను నిలుపుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా నిమగ్నం అవ్వడంతో అక్కడి అభ్యర్థులు ఏవో తిప్పలు పడుతున్నారు. ఇటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ వారి మీద ఒక బాండ రాయి వేసినట్టుగా తెలంగాణ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
నిన్న ఏకంగా తెలంగాణాలో ఆంధ్ర వారి మీద దాడులు జరుగుతున్నాయని… అక్కడ ఉన్న ఇక్కడ వారి ఆస్తులు లాక్కుంటామని బెదిరిస్తున్నారని… లాక్కోవడానికి తెలంగాణ ఏమన్నా పాకిస్థానా? ఏది లాక్కోండి చూస్తా అంటూ విరుచుకుపడ్డారు. దీనిపై తెలంగాణవాదుల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. తెలంగాణ ఏర్పడిన ఐదేళ్ళలో ఒక్క సారి కూడా ఆంధ్ర వారి మీద దాడి అనేది జరగలేదు. ఇక్కడ అన్ని రాష్ట్రాల వారు కలిసి మెలిసి ఉంటున్నారు. రాజకీయ లబ్ది కోసం పవన్ కళ్యాణ్ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు అంటున్నారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ మాటలు తెలంగాణ బరిలో ఉన్న జనసేన అభ్యర్థుల మీద గట్టిగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే గెలిచే అవకాశం లేకపోయినా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇప్పుడు తమకు డిపాజిట్లు కూడా దక్కవేమో అనుకుంటున్నారు. కొందరైతే ఇక ప్రచారం కూడా మానేస్తే డబ్బులు, వ్యయప్రయాసలైనా తప్పుతాయని అనుకుంటున్నారని సమాచారం. తెలంగాణ ఎన్నికల బరిలో పవన్ కళ్యాణ్ ఆప్తుడు మహేందర్ రెడ్డి కూడా ఉండటం విశేషం. ఆయన జనసేన వైస్ ప్రెసిడెంట్. మల్కాజ్గిరి పార్లమెంట్ కు పోటీ చేస్తున్నారు.



