ఆ కిక్కే వేరబ్బా…

Telangana government gains huge revenue from liquor shop licenses

మందు బాబులకు మద్యం తాగితేనే కిక్కొస్తుంది. కానీ ప్రభుత్వాలకు వైన్ షాపుల లైసెన్సుల ప్రక్రియతోనే చాలా కిక్కొస్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి కేవలం దరఖాస్తులు, లైసెన్స్ ఫీజులతోనే మంచి కిక్ వచ్చింది.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,601 మద్యం షాపుల కోసం ఏకంగా 95,137 దరఖాస్తులు వచ్చాయి. ఈ లైసెన్సుల జారీ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి రూ.2,845 కోట్లు ఆదాయం వచ్చింది. అంటే ప్రభుత్వం కాణీ పెట్టుబడి పెట్టకుండానే రూ.2,845 కోట్లు సంపాదించిందన్న మాట! ఇంత డబ్బు వస్తే ఏ ప్రభుత్వానికి కిక్ రాకుండా ఉంటుంది?

ADVERTISEMENT

అయితే ఈ కిక్కు ఇక్కడితో తగ్గేది కాదు. ఇక నుంచి 2,601 మద్యం షాపుల ద్వారా అమ్ముడయ్యే ప్రతీ మద్యం సీసాపై ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం బంగారు బాతు గుడ్లు వంటివే.

కనుకనే ప్రభుత్వాలను నడిపే పలువురు రాజకీయ నాయకులే వేన్నీళ్ళకు చన్నీళ్ళు తోడవసరమనట్లు సైడ్ బిజినెస్‌గా మద్యం వ్యాపారాలు కూడా చేసుకుంటారు. రాజకీయనాయకులు కాంట్రాక్టులు, సినిమాలు చేయడం తప్పు కాదు కనుక మద్యం వ్యాపారాలు చేయడం కూడా తప్పు కానే కాదు.

ప్రజల చేత మద్యం తాగించి వారి డబ్బులతో ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమ పధకాలు చేస్తుండటం, లివర్ చెడిపోతే ఆరోగ్యశ్రీతో వైద్య సదుపాయం కల్పిస్తుండటం విడ్డూరంగానే అనిపిస్తుంది. కానీ ప్రజలు కూడా ఈ పద్ధతులన్నిటికీ బాగా అలవాటు పడిపోయారు. కనుక ఈ ఒక్క విషయంలో అందరిదీకీ ఏకాభిప్రాయమే.

పిల్లల పాట్య పుస్తకాలలో ‘భారతీయులు అందరూ నా సోదర సోదరీ మణులు… ‘ అనే ప్రతిజ్ఞ ఉంటుంది. కానీ వాస్తవ జీవితంలో ఆ పేజీ కనిపించదు. మద్యం నిషేధం గురించి రాజకీయ నాయకులు చెప్పే మాటలు కూడా అచ్చం అటువంటివే. కనుక వాటిని ఎవరూ సీరియస్‌గా తీసుకోరు.

కానీ దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం తమ దశ ముగిసేసరికి సుమారు రూ.3,000 కోట్లు పీల్చేసిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది.

కానీ ఇప్పుడు మీరూ పీలుస్తున్నారు కదా? అని ఎదురు ప్రశ్న వినిపించుకోవడం లేదు. ఎందుకంటే, మద్యంతో చేసే ఏ పనికైనా ఆ కిక్కే వేరబ్బా! అంటారు.

ADVERTISEMENT
Latest Stories