తెలంగాణాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలలో అధికార పార్టీకి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ నూతన ఉత్సాహంలో ఉరకలేస్తోంది. మొత్తం 12 స్థానాలకు గానూ 10 స్థానాలను టిఆర్ఎస్ సొంతం చేసుకుంది. 6 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన ఆరు స్థానాలలో నాలుగింటిని మాత్రమే కైవసం చేసుకుంది. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు విజయం సాధించారు.
ఈ ఓటమిని జీర్ణించుకోలేని టీఆర్ఎస్ పార్టీ, “కాంగ్రెస్ పార్టీకి లభించిన రెండు సీట్లు తెలుగుదేశం ప్రభావం వల్లనేని” ఆరోపించింది. ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడిన తర్వాత మీడియాతో వ్యాఖ్యానించిన టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు, “కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్ కు టిడిపి సహాయం చేసిందని, రెండు పార్టీలు కలిసి టీఆర్ఎస్ ను ఓడించాయని, ప్రజలు అభివృద్దిని కోరుకుంటున్నారు కాబట్టే 10 స్థానాలలో విజయం సాధించగలిగామని” అన్నారు.
ఎదురు లేకుండా సాగిపోతున్న అధికార పార్టీ టీఆర్ఎస్ పయనానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. ప్రస్తుత ఫలితాలను సమీక్షించుకునే పనిలో పార్టీ వర్గాలు నిమగ్నమయ్యాయి. దీని ప్రభావమే గట్టు రామచంద్రరావు వ్యాఖ్యలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.





