ఎంతైనా ధనిక రాష్ట్రం కదా.. సూట్ కేసుల వాడకం కాస్త ఎక్కువే!

Telangana Suitcase Politics Fuels Three-Party War

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల అదృష్టం కొద్దీ మన రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు లేవు. సింగిల్ సింహం ఒకవైపు, మిగిలిన మూడు సింహాలు మరో వైపు ఉన్నాయి.

అయినా సింగిల్ సింహం ఢిల్లీ పెద్దలతో టచ్‌లోనే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ వాటిని ప్రామాణికంగా తీసుకోలేము.

ADVERTISEMENT

కానీ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్‌, బిజేపి, బీఆర్ఎస్‌ మద్య మూడు స్థంభాల ఆట కొనసాగుతూనే ఉంది. సీబీఐ కూడా ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారో కనిపెట్టలేని పరిస్థితి నెలకొంది.

మరి సామాన్య ప్రజలు ఎలా కనిపెట్టగలరు? తమ కళ్ళెదుటే ఉన్న ఫైవ్ స్టార్ హోటల్స్‌ ఎవరివో రేవంత్ రెడ్డి చెప్తేగానీ తెలుసుకోలేని అమాయకులు. కనుక ఈ మూడు స్థంభాల ఆటలో ప్రజలు కేవలం ప్రేక్షకులు మాత్రమే.

వారి హృదయాలు ఎంత విశాలమైనవంటే మూడు పార్టీలలో ఎవరు బహిరంగ సభ పెట్టినా వెళ్తారు. ఎవరు ఏం చెప్పినా చప్పట్లు కొడుతుంటారు. అలాగని వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదని కేసీఆర్‌కు అర్ధమయ్యేసరికే ఆయన ఫామ్‌హౌసులో ఉన్నారు.

తెలంగాణ ధనిక రాష్ట్రమని కేసీఆర్‌ చెప్పారు కనుక అక్కడ మొదట నుంచి ‘సూట్ కేసుల వాడకం’ చాలా ఎక్కువ. సిఎం రేవంత్‌ రెడ్డి తన పదవి కాపాడుకోవడం కోసం తన అధిష్టానానికి నెలనెలా సూట్ కేసులు సమర్పించుకు వస్తుంటారని కేటీఆర్‌ ఆరోపించని రోజు లేదు.

అయితే కేసీఆర్‌, కేటీఆర్‌ కూడా తమ కేసుల కోసం ఢిల్లీకి సూట్ కేసులు పంపుతూనే ఉన్నారని సిఎం రేవంత్‌ రెడ్డి ఆరోపిస్తుంటారు.

మిగతా అన్నిటినీ వెంటనే ఖండించే కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు ఈ సూట్ కేసులను మాత్రం ఖండించడం లేదు.ఎందుకో తెలీదు!

సరే! మద్యలో కేంద్రాన్ని కూడా లాగారు కనుక తెలంగాణ బిజేపి కూడా “సూట్ కేసులకు బారాఖూన్ మాఫ్! లక్షల కోట్ల కేసీఆర్ దందాకు లైసెన్స్ !ప్రజాధనం హరించినా హరీష్ అంటే అమితమైన ప్రేమ! వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించిన కేటీఆర్ పై ఒక్క ఎఫ్ఐఆర్ ఉండదు! ఊపర్ షేర్వానీ..అందర్ పరెషానీ..ఇదీ రేవంత్ కహానీ,” అంటూ తాజాగా ఓ ట్వీట్‌ వేసింది.

“కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావు లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తుంటావు కానీ ఎవరిపై కేసులు పెట్టవు. సూట్ కేసులు తీసుకొని పెడ్తాలేవా రేవంతూ?” అని తెలంగాణ బిజేపి ట్వీట్‌ చేసింది.

కనుక తెలంగాణలో సూట్ కేసులు ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయో, ఎవరు ఎవరిని కాపాడుతున్నారో కనిపెట్టడం సీబీఐ వల్ల కూడా కాదనే అనిపిస్తుంది. ఈ లెక్కన మన ఆంధ్రా ప్రజలు అదృష్టవంతులే కదా?

ADVERTISEMENT
Latest Stories