నేటి కాలంలో వైవాహిక బంధానికి ఉండే విలువ క్రమక్రంగా క్షిణించిపోతుందా.? భార్య భర్తల బంధాలు నానాటికి బలహీనమవుతున్నాయా.? ఇందుకు సామాన్యుడు నుండి సెలబ్రెటీల వరకు ఏ ఒక్కరు అతీతులు కారా.? అయితే ఈ బంధాలు మరీ ఇంతలా బలహీనమవ్వడానికి కారణాలేంటి.?
వేద పండితుల ముహూర్త బలం కన్నా, పరస్పర విభేదాలకే పవర్ ఎక్కువా.? ఆ కారణాలే చిన్న చిన్న విభేదాలను సైతం విడాకుల దిశగా తీసుకెళ్తున్నాయా.? మూడు ముళ్ళ బంధాన్ని ముణ్ణాళ్ల ముచ్చటగా మారుస్తున్నాయా.?
అయితే ఇందుకు నేటి తరం యువతకు వచ్చిన మితిమీరిన స్వేచ్ఛ కావచ్చు, వారికీ ఉండే ఆర్థిక వెసులుబాట్లు కావచ్చు. లేదా క్రమంగా అంతరించిపోతున్న ఉమ్మడి కుటుంబ సంస్కృతీ కావచ్చు.
అలాగే బంధాన్ని నిలబెట్టుకోవడం మీద ఉండే ఓర్పు కన్నా బంధాన్ని తుంచుకోవడంలో ఉండే ఆవేశమే ఈ సమస్యలో ప్రముఖ పాత్ర పోషించవచ్చు.
మరి ఇందులో తప్పెవరిది.? ఎవరిని నిందించాలి.? ఎవరిని దోషిగా చూపించాలి.?తల్లితండ్రులనా.? సమాజాన్నా.? చుట్టూ ఉన్న పరిస్థితులనా.? లేక ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటూ సర్దుకుంటూ, సరిపెట్టుకుంటూ ఇద్దరి జీవితాలను, రెండు కుటుంబాలను కలుపుకెళ్లలేని నేటి తరం యువత మానసిక పరిస్తితిదా.?
అయితే ఒకరకంగా ఈ సమస్యలో అందరి పాత్ర కలిసే ఉంటుంది. పెద్ద చదువులని, ఉన్నత ఉద్యోగాలని, ఉపాధి కోసమని, ఉన్న ఊరిని వదిలి, కన్నవారిని విడిచి ఒంటరిగా జీవించడానికి అలవాటు పడిన నేటి తరం యువత కనీసం కన్న తల్లితండ్రులు ఒక మాట అన్నా పడలేని పరిస్థితులలో పెరుగుతున్నారు.
అటువంటి వారు రేపటి రోజున తన గురించి పూర్తిగా తెలుసుకోలేని భాగస్వామి తో కలిసి జీవించడానికి ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొన్ని సందర్భాలలో ఎన్నో ఏళ్ళ కొద్దీ ప్రేమ వ్యవహారాలు నడిపిన వారు సైతం పెళ్లి బంధంతో ఒక్కటైనా తరువాత కొన్నాళ్లకే ఎవరి దారి వారు చూసుకుంటున్న సంఘటనలు చూస్తున్నాం.
ఒకరు ఆత్మ గౌరవంతో బతకడం అంటే మరొకరి ఆత్మాభిమానాన్ని కించపరచడం కాకూడదు. వైవాహిక జీవితంలో విడిపోవడం అంటే మూడు తరాలను మానసికంగా బాధించడమే అవుతుంది. విడిపోవాలి అనే ఆ ఇద్దరి నిర్ణయం నిన్నటి తరాన్ని కృంగతీస్తే, ప్రస్తుత తరాన్ని వేధిస్తుంది, అలాగే భవిష్యత్ తరాన్ని ప్రశ్నలతో ముంచెత్తుతుంది.
కాబట్టి పెళ్లి అనే బంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కనపరిచే ఆసక్తి ఆ బంధాన్ని నిలుపోకోవడం మీద పెట్టాలి. చేతికి ఉండే ఐదు వేళ్ళు ఒకే రకంగా ఉండనట్టే ఏ ఇద్దరి మనస్తత్వాలు కానీ అభిరుచులు కానీ నిర్ణయాలు కానీ ఎప్పుడు ఒకే రకంగా ఉండవు, ఉండలేవు.
సమస్య వచ్చినప్పుడు నేనున్నాను అనే ధైర్యం ఇవ్వగలగాలి, సందర్భాన్ని బట్టి ఒకరికొకరు తోడుగా నిలబడగలగాలి, అలాగే భాగస్వామి పట్ల ప్రేమ, గౌరవం ఉండాలి. ఇవన్నీ కూడా వైవాహిక బంధానికి పునాదులుగా నిలుస్తాయి. ఈ పునాదులు కదిలితే బంధాలు బలహినవుతాయి.
అయితే నానాటికి పెరుగుతున్న ఈ వైవాహిక విభేదాల సమస్యకు పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. అందుకు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రై మారిటల్ కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.




