ఇప్పటికి 9 సీజన్ల తరువాత మొట్ట మొదటి సారి ప్లే-ఆప్స్ గడపతొక్కిన తెలుగు టైటాన్స్, మొదటి ప్లే-ఆఫ్ మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ జట్టుపై ఒక కమాండింగ్ విక్టరీ కొట్టి మిగతా జట్లకు తమ రాకను ఒక హెచ్చరికగా పరిగణించాల్సిందే అనేటట్టు ప్రదర్శించారు.
అటు రైడింగ్, ఇటు డిఫెన్స్ లో పట్టు బిగించి మంచి విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు విజయ్ మాలిక్ సేన. తొలి ప్లే-ఆఫ్ లో గెలిచి నేడు టైటాన్స్ తమ 2వ ప్లే -ఆఫ్ ను ఆడటానికి సిద్ధమవుతున్నారు. అయితే, ఇటు ప్రత్యర్ధి ని చూస్తుంటేనే అభిమానులకు హడలెత్తుతుంది.
ఆ జట్టు లీగ్ స్టేజిలో చివరిగా ఆడిన 5 కు 5 మ్యాచ్లను నెగ్గి సెమీస్ కు అడుగుపెట్టగా, తారాజువ్వ వలె వెలిగిన ఈ దీపపు ఒత్తు మొదటి ప్లే-ఆఫ్ లోనే ఆరిపోతుందని జోస్యం చెప్పిన వారందరిని తప్పని నిరూపిస్తూ ఇప్పటికే ఆడిన 2 ప్లే-ఆఫ్ మ్యాచ్లను కూడా సొంతం చేసుకుని అన్-స్టాపబుల్ గా కనిపిస్తున్నారు పాట్నా పైరేట్స్.
అయితే అంతటి ఫామ్ లో ఉన్న పాట్నా జట్టును ఓడించాలంటే టైటాన్స్ అసాధారణ ఆటను ప్రదర్శిచాల్సిందే అంటున్నారు తెలుగు టైటాన్స్ అభిమానులు. టీం కు ఆయువుపట్టు లాగా మారిన ‘భరత్ – విజయ్’ జోడి ఈ మ్యాచ్లో కదం తొక్కక తప్పదు. తెలుగు అభిమానులను 12 సీజన్ల నుండి ఊరిస్తున్న ఆ పీ.కె.ఎల్ కప్పును అందుకోవాలి అంటే నేడు టైటాన్స్ గెలిచి తీరాల్సి ఉంటుంది.
ఈ సీజన్ మొదలయ్యే సమయానికి టైటాన్స్ జట్టుపై ప్రస్తుతం ఉన్నన్ని అంచనాలు లేవు. ఆన్-పేపర్ అంత బలమైన టీం కాకపోయినా, జట్టు లోని ప్రతి ఆటగాడు స్టార్-ప్లేయర్ వలె జట్టుకు కావాల్సిన సమయంలో తమవంతు సాయం చేస్తూ ఇక్కడిదాకా జట్టును లాక్కొచ్చారు.
ఇలాగే అండర్-డాగ్స్ గా ఐపీఎల్-2025 లో అడుగుపెట్టిన ఆర్.సి.బీ జట్టు కప్పును ఎగరేసుకు పోయారు, చూడాలి మరి టైటాన్స్ కూడా అదే బాట లో నడుస్తారా అని…?




