ఒకప్పుడు మంచి ప్రభుత్వోద్యోగం, కుటుంబం, ఆస్తులు సంపాదించి సమాజంలో గుర్తింపు గౌరవం పొందాలనుకునేవారు. తర్వాత తరంవారు అమెరికా, కెనడా తదితర విదేశాలలో చదువుకొని అక్కడే స్థిరపడి గొప్పగా, గౌరవంగా భావించేవారు.
వారి తర్వాత తరంవారు మొబైల్ ఫోన్లో సెల్ఫీలు తీసుకునే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎన్ని ‘లైక్స్’ వస్తే అంత గొప్పనుకోవడం మొదలుపెట్టారు.
ఇప్పుడు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ రీల్స్ చేస్తూ సమాజంలో గుర్తింపు సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇంట్లో భార్యా భర్తలు ఒకరినొకరు అపహాస్యం చేసుకుంటూ, వెర్రి చేష్టలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో బహిరంగంగా పెట్టడమే విచిత్రమనుకుంటే, మళ్ళీ వాటికి లైక్స్, ఆ లైక్స్ తో సమాజంలో గుర్తింపు, సంపాదన కూడా ఆశిస్తుండటం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది.
అగ్గిపుల్లతో దీపం వెలిగించవచ్చు… మంట పెట్టుకొని ఆస్తులు, ప్రాణాలూ పోగొట్టుకోవచ్చన్నట్లు, సోషల్ మీడియాని సద్వినియోగం చేసుకుంటున్నవారు కోకొల్లలు ఉన్నారు.
వంటలు, వంటింటి చిట్కాలు, గృహోపకరణాల మరమత్తులు, పర్యాటక స్థలాలు, ఆలయాలు విశిష్టతలు, చదువులు, కళలు, సాహిత్యం, పుస్తకాలు, కంప్యూటర్ పాఠాలు వంటి అనేక ఉపయోగకరమైన విషయాలపై తమ అవగాహన, ఆసక్తులు, అభిరుచులను నలుగురితో పంచుకుంటూ సమాజంలో మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న వారు కోకోల్లలున్నారు. తద్వారా ఉడతాభక్తిగా నలుగురికీ ఎంతో కొంత ఉపయోగపడుతూ సమాజానికి మేలు చేస్తున్నారు కూడా.
కనుక సెల్ఫీల తర్వాత మొదలై కొనసాగుతున్న ఈ రీల్స్ శకంలో కూడా మంచీ చెడూ రెండూ ఉన్నాయని స్పష్టమవుతోంది. కాకపోతే చెడుతో తాత్కాలిక గుర్తింపు లభించినా దానికి అటువంటి రీల్స్ చేస్తున్నవారు, వారి కుటుంబాలు ఎప్పుడో అప్పుడు మూల్యం చెల్లించాల్సి వస్తుందని మరిచిపోకూడదు.
దూసుకు వస్తున్న రైలుకి ఎదురెళ్ళి రీల్స్ చేయవచ్చేమో కానీ తర్వాత దానిని చూసుకునే అవకాశం ఉండదు. కనుక సమాజంలో మంచితో లభించే గుర్తింపే మంచిది.




