సినీ పరిశ్రమలో మంచి మంచి నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా పేరు సంపాదించుకునేవారు చాలా మందే ఉంటారు. కానీ కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, ఇతరులను కించపరుస్తూ నోటికొచ్చినట్లు ఏదో మాట్లాడుతూ అందరి దృష్టిలో పడుతుంటారు.
గుర్తింపు పొందాలనే వారు ఆవిధంగా మాట్లాడుతున్నారా లేదా తమ అసమర్దత, వైఫల్యాల నుంచి అందరి దృష్టి మళ్ళించేందుకు ఆవిధంగా చేస్తున్నారా?అనే చర్చ పక్కన పెడితే సినీ పరిశ్రమలో ఇప్పటికే చాలా అవాంచనీయమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కనుక ఇటువంటివి ఇంకా కొత్త సమస్యలు సృష్టిస్తాయని చెప్పక తప్పదు.
ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులతో సహా దేశవ్యాప్తంగా గొప్ప దర్శకుడుగా పేరు పొందిన వ్యక్తి ఆ తర్వాత వివాదస్పద దర్శకుడుగా మిగిలిపోవడం అందరూ చూశారు.
ఒకప్పుడు మంచి హాస్య నటుడుగా పేరు సంపాదించుకున్న వ్యక్తి తర్వాత నిర్మాతగా మారి అనేక హిట్ సినిమాలు చేశారు. తర్వాత రాజకీయాలో ప్రవేశించారు. కానీ హాస్యనటుడు నుంచి నిర్మాతగా మారి హిట్స్ కొట్టి, రాజకీయాలలో ప్రవేశించిన తర్వాత ఆయన మాట తీరు కూడా మారిపోయింది.
కడవంత గుమ్మడికాయ కూడా కత్తిపీటకు లోకువే అన్నట్లు నోటికి పని చెప్పారు. రాజకీయాలలో నోరు పెట్టుకొని రాణిస్తున్నవారు చాలా మందే ఉన్నారు. కానీ ఈయన రాణించలేక మళ్ళీ సినీ పరిశ్రమలోకి వచ్చి పడ్డారు. వస్తూనే పరోక్షంగా పంచ్ డైలాగులు కొట్టడం, ఇండస్ట్రీలో ఎవరో ఒకరిని ఎద్దేవా చేయడం మొదలు పెట్టారు.
సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు అందరి లక్ష్యం సినిమాలే కావాలి తప్ప సినిమాలు తీసేవాళ్ళు నటించేవాళ్ళు కానే కాదు. ఒకవేళ ఎవరితోనోనైనా పోటీ పడి నెగ్గలేక ఆక్రోశంతో మాట్లాడినా అర్ధం చేసుకోవచ్చు.
కానీ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన దిల్ రాజు వంటి ప్రముఖ నిర్మాతలు సైతం చాలా హుందాగా, అణకువగా వ్యవహరిస్తుంటే, ఇండస్ట్రీకి తిరిగి వచ్చిన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న సదరు వ్యక్తి బుర్రకి బదులు నోటికి పని చెపుతుండటం చాలా శోచనీయం. ఆయనెవరో ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. తాజా సినిమా ఫంక్షన్స్ చూస్తే చాలు!




