తెలుగు సినీ పరిశ్రమలో పూరీ జగన్నాధ్ ఉదంతం కలకలం రేపుతోంది. తాజాగా స్పందించిన డిస్ట్రిబ్యూటర్లు ఈ ఘటనను ఖండించారు. అసలు పూరీ జగన్నాథ్ ఇంట్లో కెళ్లాలంటే ముందుగా గేటు దగ్గర సెక్యూరిటీని దాటుకుని వెళ్లాలి, తరువాత బౌన్సర్లను దాటుకెళ్లాలి, ఆ తరువాత వ్యక్తిగత గన్ మన్ ను దాటుకుని వెళ్లాలి. కనీసం ఆయన ఇంట్లో లిఫ్ట్ ఎక్కాలన్నా బౌన్సర్ దాని డోర్ ఓపెన్ చేస్తేనే పూరీ ఇంట్లోకి వెళ్లగలమని డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు. అదంతా ఒక ఎత్తైతే… పూరీ నివాసంలో సీసీ కెమెరా నిఘా ఉందని, ఇన్నింటి మధ్య పూరీ జగన్నాథ్ ఇంటికి వెళ్లి, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అయిన డిస్ట్రిబ్యూటర్ రాందాసు ఎలా దాడి చేస్తారని వారు ప్రశ్నించారు. ఒకవేళ ఆయన నిజంగా దాడి చేసి ఉంటే, ఆ ఇంటి నుంచి బయటకు రాగలిగి ఉండేవారా? అంటూ నిలదీశారు.
అదీ కాక తమతో ఏదైనా సమస్య ఉంటే… నిర్మాతల మండలి, దర్శకుల సంఘం, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇలా పలు సంఘాలు ఉన్నాయని, వీటన్నింటినీ వదిలేసి, పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తమపై ఆరు కేసులు పెట్టిన పూరీ జగన్నాధ్ కు ‘హార్ట్ ఎటాక్’ సినిమా సర్టిఫికేట్ కోసం సహాయం చేశామని చెప్పారు. పూరీ జగన్నాథ్ తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారని, అయితే చట్టంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, దర్యాప్తులో నిజానిజాలు వెలుగు చూస్తాయని తమ ఆవేదన వెళ్లగక్కారు.
ఇదిలా ఉంటే, సీనియర్ సినీ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ ఈ ఘటనపై స్పందించారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ పై అసలు దాడి ఎందుకు జరిగిందో తనకు తెలియదని, డబ్బుల విషయం నిర్మాతకు సంబంధం ఉంటుంది తప్ప, దర్శకుడికి ఎలాంటి సంబంధమూ ఉండదని, మరి, పూరీ జగన్నాథ్ పై దాడి ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదని అన్నారు. అదీకాక, డిస్ట్రిబ్యూటర్లపై పూరీ జగన్నాథ్ ఎందుకు కేసు పెట్టారో తెలుసుకోవాల్సిన అవసరముందని అన్నారు.
అలాగే మరో సినీ నిర్మాత సి.కళ్యాణ్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. పూరీ జగన్నాథ్ వ్యక్తిగతంగా డిస్ట్రిబ్యూటర్లపై ఫిర్యాదు చేసి ఉండరని, అలాగే పూరీ జగన్నాథ్ పై దాడికి పాల్పడే వ్యక్తిత్వం కలవారు సదరు డిస్ట్రిబ్యూటర్లు కాదని అన్నారు. ఎంతో కాలంగా డిస్ట్రిబ్యూటర్లు పరిశ్రమలో ఉన్నారని, వారి మంచితనంతో నిర్మాతలు, దర్శకులను ఆకట్టుకున్నారే తప్ప దాడులకు పాల్పడలేదని, బహుశా పూరీ, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య అవగాహనా లోపం కారణంగా సమస్య ఏర్పడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎవరినీ కదిపినా, పూరీ జగన్నాధ్ ఉదంతమే వినపడుతోంది.



