టాలీవుడ్ కు ఈ సెప్టెంబర్ నెల ఒక తార జువ్వ లాగా వెలిగింది. ఆగష్టు లో కూలీ, వార్-2 వంటి భారీ ప్రాజెక్ట్స్ వచ్చినప్పటికీ ఏ సినిమా కు పాజిటివ్ టాక్ దక్కలేదు. రెండు సినిమాలు భారీ హైప్ తో విడుదలైనప్పటికీ, ఆ హైప్ కేవలం డే-1 రికార్డుల వారికే పని చేసింది.
పరదా, ఓం శాంతి శాంతి శాంతిః వంటి సినిమాలు వచ్చినప్పటికీ, అది బాక్స్-ఆఫీస్ వద్ద ఊపు చూపలేకపోయాయి. ఆ ముందు నెల చూసుకున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు, విజయ్ దేవరకొండ – కింగ్డమ్ వంటి సినిమాలు విడుదలై ముందు మంచి క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ, అది బాక్స్-ఆఫీస్ వద్ద చూపటంలో విఫలమయ్యాయి.
అయితే, ఏ శుభకార్యానికైనా పునాది ముఖ్యం అన్నట్టు, సెప్టెంబర్ కు కూడా ‘లిటిల్ హార్ట్స్’ అలాంటి ఆరంభాన్నే అందించింది. సోషల్ మీడియా సెలబ్రిటీ మౌళి లీడ్ గా థియేటర్లకు వచ్చిన లిటిల్ హార్ట్స్, ప్రీమియర్స్ నుండే సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. కేవలం 2 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 20 రేట్లు లాభాన్ని అందిస్తూ సుమారు 40 కోట్ల కలెక్షన్లతో అబ్బుర పరించింది.
అది ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు కొనసాగింపు ఎలా ఉండాలో, అలా ఉండేటట్లు చేసాయి ‘మిరాయ్’ మరియు ‘కిష్కింధపూరి’. తక్కువ బడ్జెట్ మరియు సమయంలో తెరకెక్కిన కిష్కింధపురి బాక్స్-ఆఫీస్ వద్ద పర్లేదనిపించుకున్నా, లిమిటెడ్ బడ్జెట్ తో భారీ స్థాయి విజువల్స్ అందించిన మిరాయ్ ను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇలా, లిటిల్ హార్ట్స్ తో మొదలయిన సెప్టెంబర్ మాసం టాలీవుడ్ ని ఈ ఒక గాడి లో పెట్టాయి.
అయితే, అప్పుడే వచ్చింది ఎన్నాళ్లగానో ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న ‘దే కాల్ హిం ఓజీ’. పవన్ కళ్యాణ్ కు ఒక అభిమాని గా తాను ఎలా చూడాలి అనుకుంటున్నాడో, అలాగే చూపించి ఫాన్స్ ను ఖుషి చేసాడు సుజీత్. రిలీజ్ కు 2 ఏళ్ళ ముందు నుండే ఓజీ కు క్రేజ్ రావటం అదృష్టం. పవన్ లుక్స్ కు సుజీత్ టేకింగ్ తోడయితే, థమన్ ఇంక బాక్సులు బద్దలైపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా ను నిలబెట్టేసారు.
తొలి రోజే ఏకంగా 154 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి, 2025 కే అతి పెద్ద ఓపెనింగ్ కలెక్షన్ గా మారింది ఓజీ. 151 కోట్ల ఓపెనింగ్ వచ్చిన కూలీ ను అధిగమించి ఓజీ టాప్ ప్లేస్ కు చేరుకుంది. ఇలా, ఒక మంచి ఆరంభాన్ని , చక్కగా కొనసాగిస్తూ, అద్భుతమైన శైలి లో ముగించింది సెప్టెంబర్ మాసం. మరి ‘కాంతారా’ తో అక్టోబర్ నెల కూడా ఇదే బాట లో పయనిస్తుందా..?






