సోషల్ మీడియాలో సినీ నటీనటులపై నిత్యం కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్లపై వచ్చే కామెంట్స్ అసభ్యంగా ఉంటాయి. కానీ చాలా వరకు వాటిని పట్టించుకోరు. కానీ వారి సహనం నశించినప్పుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి పిర్యాదులు చేస్తుంటారు.
నటి త్రిష కూడా సోషల్ మీడియాలో బహుశః అలాంటి కామెంట్స్ భరించే ఉంటారు. కానీ ఇప్పుడు ఆమె జోలికి వెళ్ళాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి. కారణం అందరికీ తెలుసు.
మాజీ మంత్రి, శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ఆమెపై నోరు జారినందుకు పోలీసులు ఆయనని అరెస్ట్ చేశారు. కావేరీ జల వివాదంపై తంజావూరులో జరిగిన ఓ సభలో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు, కొందరు ‘త్రిష.. త్రిష..’ అంటూ నినాదాలు చేశారు. ఆయన స్పందిస్తూ ఆమెను ఉద్దేశ్యించి ద్వందార్ధంతో ఓ మాట అన్నారు.
తక్షణం టివీకే పార్టీ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేయడం, వెంటనే కేసు నమోదు చేసుకొని ఆయనని అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయింది. కానీ ఆయన కూడా అంతే చురుకుగా కోర్టులో పిటిషన్ వేసి వెంటనే బెయిల్ సంపాదించుకున్నారు.
జోసఫ్ విజయ్ తమిళనాడు సిఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, అయన వదులుకున్న స్థానం నుంచి త్రిష పోటీ చేస్తారని, ఆమెకు డెప్యూటీ సిఎం పదవి ఇవ్వబోతున్నారంటూ ఆ మధ్యన జోరుగా ఊహాగానాలు వినిపించాయి. కానీ అలాంటివేమీ జరుగలేదు.
కానీ ఇప్పుడు త్రిష కేవలం సినీ నటి మాత్రమే కాదు.. చాలా పవర్ ఫుల్ లేడీ అని ఉదయనిధి స్టాలిన్ అరెస్టుతో స్పష్టమైంది.
అయితే రాష్ట్రంలో ఎవరు మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జోసఫ్ విజయ్ ప్రభుత్వం హెచ్చరిస్తోంది… కనుక అలాగే ఇదీ అని సరిపెట్టుకోవాలేమో?




