అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏడో ఎనిమిదో యుద్ధాలు ఆపిన శాంతి దూత. కానీ నోబుల్ శాంతి బహుమతి ఆయనకు దక్కలేదు. అది వేరే విషయం.
ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం ఆపకపోతే దానిని ఆపేందుకు యుద్ధం చేయడానికి వెనకడనని శాంతి దూత హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈలోగా మళ్ళీ ఇజ్రాయెల్ హమాస్ మీద దాడులకు రెడీ అవుతోంది. కనుక యుద్ధం ఆపేందుకు ఇజ్రాయెల్‌తో కూడా యుద్ధం చేయక తప్పదేమో.
ఆఫ్ఘనిస్తాన్ శాంతి ఒప్పందానికి కట్టుబడి కాల్పులు విరమణ పాటించకపోతే దానిపై భీకర దాడి చేస్తామని పాక్ హెచ్చరిస్తోంది. కనుక అవి మళ్ళీ మొదలుపెడితే వాటిని ఆపేందుకు వాటితో కూడా యుద్ధం చేయక తప్పదేమో?
ట్రంప్ శాంతి ప్రయత్నాలను ఎవరూ అర్ధం చేసుకోవడం లేదనే చెప్పాలి. కానీ అయన ఎంత శాంతి కామకుడో ఈరోజు ఫేస్ బుక్‌లో వచ్చిన ఈ కార్టూన్ చూస్తే అర్ధమవుతుంది.
దానిలో కురుక్షేత్ర మహా సంగ్రామం మొదలయ్యే ముందు డోనాల్డ్ ట్రంప్ అక్కడకు చేరుకొని యుద్ధం నిలిపివేయాలని శ్రీకృష్ణుడుకి నచ్చజెపుతున్నట్లు కనిపిస్తుంది. ట్రంప్ మనసుని ఇంత బాగా అర్ధం చేసుకున్న అ మహానుభావుడికి శతకోటి వందనాలు చెప్పాల్సిందే!
కానీ ట్రంప్ కొన్ని యుగాలు ఆలస్యంగా జన్మించడం వలన ప్రపంచంలో అనేక యుద్ధాలు జరిగిపోయాయి. వాటిలో అనేక కోట్ల మంది చనిపోయారు. కనీసం వరల్డ్ వార్-2 ముందు ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్నా జపాన్ మీద అణు బాంబులు వేయనిచ్చేవారు కారేమో?
ఇలాంటి గొప్ప శాంతి దూత మన యుగంలో పుట్టడం మన అందరి అదృష్టమే. ఆయన మాటలు, చేతలు అనీ చూసి తరించే భాగ్యం కేవలం ఈ యుగంలో వారికి మాత్రమే లభిస్తుంది.
ఏది ఏమైనప్పటికీ, ముల్లుని ముల్లుతోనే తీయక తప్పదు కనుక రష్యా మాట వినకపోతే దాడి చేయడానికి ఆ దేశ తీరానికి సమీపంలో అణ్వాయుధాలు కలిగిన అమెరికన్ సబ్ మెరైన్లు సిద్దంగా ఉంచారు.
ఇవన్నీ యుద్ధాలు ఆపేందుకు ఆయన చేయబోయే యుద్ధాలే తప్ప మరొకటి కాజాలవు. కనుక ఆయనని ఎవరూ అపార్ధం చేసుకోకూడదు. కుంటే అజ్ఞానుల కిందే లెక్క!







