ఒక దేశం మరో దేశంపై అతిగా ఆధారపడితే ఏమవుతుందో ట్రంప్ ఆంక్షలతో నష్టపోతున్న భారత్‌తో సహా ప్రపంచ దేశాలను చూస్తే అర్ధమవుతుంది.
కానీ ప్రపంచ దేశాలను ఎల్లప్పుడూ వాడేసుకోవడమే తప్ప వేటిపై పెద్దగా ఆధారపడని చైనా ఎంత నిబ్బరంగా నిలబడిందో చూస్తున్నాము. అంటే ప్రతీ దేశమూ స్వయంసంవృద్ధి సాధించడం చాలా అవసరమని చైనా మరోసారి నిరూపిస్తోంది.
కానీ ట్రంప్ కంకు కొడుతున్న దెబ్బలకు జీఎస్టీ లేపనం పూయడం అంటే మసి రాసి మారేడుకాయ చేయడమే అవుతుంది.
ఓ ప్రముఖ ఆంగ్లపత్రికలో ఈ అంశం గురించి ఓ ఆర్టికల్ వచ్చింది. దానిలో విదేశీ ఎగుమతుల పేరుతో భారత్‌తో పలు దేశాలు అమెరికా అతిగా ఆధారపడటం వలననే నేడు ఎదురు దెబ్బ తగిలేసరికి తట్టుకోలేక విలవిలలాడుతున్నాయి. అదే… విదేశీ ఎగుమతులు, దిగుమతులపై 25 శాతం వరకు మాత్రమే ఆధారపడగలిగే స్థాయికి స్వయంసంవృద్ది సాధించగలిగినట్లయితే ఇటువంటి ఆటుపోట్లు పెద్దగా ప్రభావం చూపవని పేర్కొంది. ఇది అక్షరాల నిజమని అందరికీ తెలుసు.
ఈవిషయం కేంద్ర ప్రభుత్వం చాలా ఏళ్ళ క్రితమే గ్రహించి ‘మేకిన్ ఇండియా’, ‘ఆత్మ నిర్భర్ భారత్’ వంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తోంది.
అయితే మన ప్రభుత్వ వ్యవస్థలలో ఉండే ఉదాసీనత, అధికారుల లంచగొండితనం, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు సామాన్య ప్రజలను దోచుకోవాలనుకోవడం లేదా తప్పుడు మార్గాలలో సంపాదించాలనుకోవడం వంటి అనేక అవలక్షణాల వలన ఆశించిన స్థాయిలో దేశీయ పరిశ్రమలు అభివృద్ధి చెందడం లేదు. వీటికి తోడూ కేంద్ర ప్రభుత్వం ‘చైనా మాల్’ దిగుమతులను కట్టడి చేయలేకపోతోంది.
ఇక కేంద్ర రాష్ట్ర రాజకీయాలు కూడా అభివృద్ధికి అవరోధంగా నిలుస్తున్నాయి. కనుక ఇటువంటి సమస్యలన్నిటినీ కనీసం 50 శాతం అయినా పరిష్కరించుకున్నప్పుడే భారత్ అభివృద్ధి వేగవంతమవుతుంది.
జీఎస్టీ తగ్గించడం ద్వారా స్వదేశీ ఉత్పత్తులు కొనుగోలు గణనీయంగా పెరిగాయంటే అర్ధం ఏమిటి? దేశీయ ఉత్పత్తులకు బలమైన మార్కెట్ ఉందని స్పష్టమవుతోంది కదా?మరి ట్రంప్ కన్నెర్ర చేస్తే భయపడటం దేనికి?
“ఇట్ హాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా,’ అనే మాట తరచూ వింటాము. కరోనా మహమ్మారిని జయించినప్పుడే భారత్ సత్తా లోకానికి తెలిసింది. ట్రంప్ సవాళ్ళు దాని కంటే పెద్దవా? వాటిని భారత్ ఎదుర్కొని విజయం సాధించడం కష్టమా?




