ట్రంప్‌ని జిన్ ‘పింగ్’ చేశారా?

Donald Trump meeting Xi Jinping amid discussions on Iran tensions, Taiwan issue, and US-China relations

సింహం ఎప్పుడూ సింహమే. అది అడవిలో ఉన్న ఊర్లోకి వచ్చిన సింహంలాగే దర్జాగా తిరుగుతుంది తప్ప కుక్కలా మొరగదు. నక్కలా భయపడదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ తాను కూడా అలాంటి వాడినేనని అనుకుంటారు. అనే చెప్పుకుంటారు.

ఆయన ప్రతాపం చూస్తున్న ప్రపంచ దేశాల ప్రజలు కూడా అలాగే అనుకున్నారు ఇంతకాలం. కానీ సింహంలాంటి ట్రంప్‌ చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్‌ని చూసి ‘మ్యావ్ మ్యావ్’మన్నప్పుడు అందరూ షాక్ అయ్యే ఉంటారు.

ADVERTISEMENT

ఇంతకీ విషయం ఏమిటంటే, ఇరాన్‌తో యుద్ధం ఎలా ముగించి బయటపడాలో తెలియక అవస్థ పడుతున్న ట్రంప్‌ మొదట పాకిస్తాన్‌ని నమ్మి మధ్యవర్తిత్వం బాధ్యత అప్పజెప్పారు. కానీ పేనుకి పెత్తనం ఇస్తే జుట్టంతా గొరిగిపెట్టిందన్నట్లు పాక్‌ మధ్యవర్తిత్వంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది. హోర్మూజ్ జలసంధి బంద్ అయిపొయింది. దీంతో చమురు కొరత పెరిగిపోయి ట్రంప్‌ మీద ప్రపంచ దేశాల ఒత్తిడి పెరిగిపోతోంది.

కనుక పాక్‌ వల్ల కాని పని చైనా వల్ల అవుతుందనుకున్నారో ఏమో, అక్కడకు బయలుదేరుతూ “అక్కడ నాకేదైనా అయితే…” అంటూ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేరిట ఓ రహస్య వీలునామా వ్రాసి పెట్టి, చైనా వెళ్ళి ఆప్తమిత్రుడు జిన్ పింగ్‌ని కలిశారు.

అక్కడ వాళ్ళిద్దరూ ఇరాన్‌ యుద్ధం-హోర్మూజ్ లాక్ డవున్ గురించి ఏం మాట్లాడుకున్నారో లేదో తెలీదు. కానీ తైవాన్ గురించి మాట్లాడుకున్నారని వారి స్టేట్‌మెంట్‌ల ద్వారా తెలిసింది. తైవాన్ వ్యవహారంలో వేలు పెట్టవద్దని ట్రంప్‌ని జిన్ ‘పింగ్’ చేసినట్లున్నారు. ట్రంప్‌ సరేనన్నారు. అందుకు ప్రతిగా జిన్ పింగ్ ఆయనకి ఏం హామీ ఇచ్చారో త్వరలో తెలుస్తుంది.

ట్రంప్‌ అందితే జుట్టు లేకుంటే కాళ్ళు అన్నట్లే వ్యవహరించారని చెప్పొచ్చు. అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌తో పాటు చైనాపై భారీగా సుంకాలు విధించారు. ఇప్పుడు అదే చైనా సాయం కోరుతున్నారు.

అమెరికా-తైవాన్‌ ఒప్పందంలో భాగంగా తైవాన్‌కు భారీగా ఆయుధాలు సరఫరా చేసిన అమెరికా, ఇప్పుడు ‘వన్ చైనా’ పాలసీ అంటున్నారు. ఒక దేశంలో అంతర్భాగం అంటే ఒక రాష్ట్రమవుతుంది. ఆ దేశంతో సంబంధం లేకుండా ఆ రాష్ట్రానికి మరో దేశం ఆయుధాలు సరఫరా చేయగలదా? కానీ అమెరికా సరఫరా చేస్తోందంటే అర్థం ఏమిటి?

ఇప్పుడు అమెరికా బారి నుంచి ఇరాన్‌ని కాపాడటం కాదు… ఎవరైనా ట్రంప్‌ని కాపాడండర్రా.. ఈ యుద్ధం నుంచి ఎలా బయటపడాలో చెప్పండర్రా… అనిపిస్తోందా? సహజమే!

ADVERTISEMENT
Latest Stories