నారా లోకేష్‌కు జెడ్ కేటగిరీ భద్రత… మెసేజ్ స్పష్టంగానే ఉందిగా

Z Category Security For Nara Lokesh

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఏపీలో అధికార వైసీపికి నచ్చని రెండు కీలక నిర్ణయాలు జరిగాయి. ఒకటి వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. రెండు. టిడిపి యువనేత నారా లోకేష్‌కు కేంద్ర హోంశాఖ జెడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఇప్పటికే ఎన్నికల సంఘం హెచ్చరించింది. కానీ వైసీపి నేతల ఒత్తిళ్ళకు తలొగ్గి వాలంటీర్లు వైసీపి ఎన్నికల ప్రచారంలో పాల్గొనక తప్పడం లేదు. దీంతో వారిపై ఎన్నికల సంఘం వేటు వేస్తూనే ఉంది. ఇప్పుడు వాలంటీర్లు ఇంటింటికీ వెళ్ళి పింఛన్ ఇవ్వరాదని ఎన్నికల సంఘం ఆదేశించడం వైసీపికి మింగుడు పడని విషయమే.

ADVERTISEMENT

ఈ ఎన్నికల కోసమే జగన్‌ ప్రభుత్వం వాలంటీర్లతో ఓ ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు వారిని ఇప్పుడు ఏవిదంగానూ వినియోగించుకోకూడదని ఆంక్షలు విధిస్తుంటే ఈ ఐడియా నిరుపయోగమవుతుంది.

అసలు జగన్‌ ప్రభుత్వం వైసీపీ నేతలు, కార్యకర్తల కంటే వాలంటీర్లనే ఎక్కువగా నమ్ముకుందని అందరికీ తెలుసు. సంక్షేమ పధకాల పేరుతో వాలంటీర్లను ప్రతీ ఇంటికి పంపించి వారిని వైసీపి ఓటర్లుగా మార్చే ప్రక్రియ దాదాపు ఐదేళ్ళుగా నిర్విరామంగా జరుగుతోంది. కానీ ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు వాలంటీర్లు వైసీపికి అందుబాటులో లేకపోతే జరిగే నష్టం అంతా ఇంతా కాదు.

అలాగని వాలంటీర్లు అందరినీ ఉద్యోగాలలో తొలగించి లేదా వారిచేత రాజీనామాలు చేయించి వైసీపి కోసం వాడుకొందామని చూస్తే వారు, వారి కుటుంబాలు వైసీపికి వ్యతిరేకంగా మరే ప్రమాదం ఉంది. కనుక ఈ సమస్యను వైసీపి అధినేత జగన్‌ ఏవిదంగా అధిగమిస్తారో చూడాలి.

రాష్ట్రంలో వైసీపి అధికారంలోకి రాగానే టిడిపి యువనేత నారా లోకేష్‌కు భద్రత తగ్గించేసింది. తన భద్రత పెంచాలని ఆయన జగన్‌ ప్రభుత్వానికి ఎన్ని లేఖలు వ్రాసినా పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడుపైనే భౌతిక దాడులు జరిగినప్పుడు నిత్యం పాదయాత్రలు చేస్తుండే నారా లోకేష్‌కు ఇంకా ప్రమాదం పొంచి ఉంటుంది.

యువగళం పాదయాత్రలో రెండు మూడుసార్లు ఆయనపై దాడులు జరిగాయి కూడా. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడినందున నారా లోకేష్‌కు ప్రమాదం ఇంకా పెరుగుతుందని తెలిసి ఉన్నప్పటికీ జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో కేంద్ర హోంశాఖ జెడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. నారా లోకేష్‌కు తమ ప్రభుత్వం భద్రత తగ్గిస్తే కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పించడం వైసీపి జీర్ణించుకోవడం కష్టమే.

ఇంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, నారా లోకేష్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించడం ద్వారా కేంద్రం జగన్‌ ప్రభుత్వానికి చాలా స్పష్టమైన సంకేతమే ఇచ్చిందని భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories