రివ్యూల మీద ఏడిస్తే సినిమాలు ఆడతాయా బాసూ?

Movie Reviewsఅదేంటో కొందరు హీరోలకు, దర్శకులకు తమ సినిమా తేడా కొడితే అంగీకరించడానికి మనసు రాదు కదా పైపెచ్చు తప్పులను కప్పి పుచ్చుకోవడానికి ఆ నిందను ఎవరి మీద వేద్దామాని ఎదురు చూస్తుంటారు. విజె సన్నీ గురించి బిగ్ బాస్ ప్రోగ్రాంలో పాల్గొన్నాడన్న పేరు తప్ప సగటు థియేటర్ ఆడియన్స్ గురించి ఇతని గురించి తెలిసింది చాలా తక్కువ. ఇటీవలే ఆన్ స్టాపబుల్ అనే గొప్ప చిత్రం చేశాడు.

మొదటి అటకే టాక్ చేతులెత్తేసింది. ట్యాగ్ లైన్ లో ఉన్న కామెడీ తెరమీద కనిపించకపోవడంతో తీసినోళ్లు చూసినోళ్లు నవ్వులపాలయ్యారు. ఏం జరిగిందో అర్థమైనా టీమ్ సక్సెస్ మీట్ పెట్టుకుంది. ఇందులో తప్పేమీ లేదు. అబద్దమో నిజమో హిట్టయ్యిందని చెప్పుకోడం సహజం. ఇక్కడితో ఆగితే సంతోషమే. కానీ విజె సన్నీకి రివ్యూల మీద కోపం వచ్చింది.

ADVERTISEMENT

బాలేదని రాశారని ఉక్రోషం పొడుచుకు వచ్చింది. తానేదో సూపర్ స్టార్ అన్న రేంజ్ లో ఫీలైపోయి ఎవరైనా సరే ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీసి, ప్రమోషన్లు చేసి, థియేటర్లలో రిలీజ్ చేసి అప్పుడు రివ్యూ రైటర్ అయితే ఒప్పుకుంటానని ఐక్యరాజ్యసమితి ప్రెసిడెంట్ రేంజ్ లో చాంతాండంత స్పీచ్ ఇచ్చేశాడు. స్క్రీన్ మీద స్క్రాప్ అనిపించిన కామెడీ స్టేజి మీద మాత్రం అద్భుతంగా పండింది.

ఏ మాత్రం లాజిక్ లేకుండా సన్నీ చేసిన కామెంట్స్ బ్యాక్ ఫైర్ అయ్యాయి. ఇప్పుడు ఇతని ప్రకారం ఒక హోటల్ లో ఫుడ్డు బాలేదని చెప్పాలంటే ముందు విత్తనాలు నాటి, పంట పండించి, మార్కెట్ లో అమ్ముకుని వచ్చాక హక్కు వస్తుందన్న మాట. బస్సులో ప్రయాణం చేసేటప్పుడు డ్రైవింగ్ బాలేదని తిట్టడానికి ముందు మనం ఆర్టిసి కాలేజీలో చేరి, శిక్షణ తీసుకుని, అయ్యా డ్రైవర్ సాబ్ మీరు సరిగా నడపడం లేదని సర్టిఫికెట్ ఇవ్వొచ్చన్న మాట.

సన్నీ మాటలు ఇలాగే ఉన్నాయి మరి. సినిమాలో కంటెంట్ బాగున్నప్పుడు రివ్యూలే కాదు ఎవరూ దాన్ని ఆపలేవనే సంగతి తెలిసి కూడా ఇలా నోరు జరగడం వల్ల వచ్చే నష్టం సన్నీ లాంటి అప్ కమింగ్ యాక్టర్స్ గుర్తించకపోవడం ట్రాజెడీ. పైగా అందరూ బాలేదని మొత్తుకున్న దాన్ని గొప్ప కళాఖండం తీశాం, కేవలం రివ్యూల వల్ల కలెక్షన్లు రావడం లేదని వాపోవడం అపరిపక్వతను సూచిస్తుంది.

ఇక్కడితో ఆగక పరిశ్రమ మాకు అమ్మ లాంటిదని, అందరూ కష్టపడతారని సెంటిమెంట్ కోటింగ్ ఇవ్వడం ఇంకా సిల్లీ. రోజుకు వంద రూపాయలు సంపాదించే కూలి కూడా చెమట చిందించనిదే ఆ డబ్బు చేతికి రాదు. ఒక వస్తువు బాలేనప్పుడు అది చెప్పే హక్కు కొనుక్కున్న కస్టమర్ కి ఉంటుంది.

సపోజ్ పర్ సపోజ్ సన్నీ ఓ కొత్త కారు కొంటే మొదటి రోజే బ్రేక్ డౌన్ అయ్యిందనుకోండి. అయ్యో పాపం వర్కర్స్ ఎంత కష్టపడి దీన్ని అసెంబుల్ చేశారోనని మౌనంగా ఉంటాడా, లేక షో రూమ్ కు వెళ్లి మేనేజర్ ని నిలదీస్తాడా. వంద శాతం రెండోదే జరుగుతుంది. ఏదో కెమెరాలు కవర్ చేస్తున్నాయి కదాని ఇష్టం వచ్చినట్టు పెట్రేగిపోవడం, సింపతీతో జనాలు థియేటర్లకు వస్తారనే భ్రమలో ఉన్నంతకాలం ఇలాంటి అన్ స్టాపబుల్ రియల్ కామెడీలు స్టేజి మీద జరుగుతూనే ఉంటాయి.

ADVERTISEMENT
Latest Stories