తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితి అటుఇటు కాకుండా అవుతున్నటుంది. నియోజకవర్గంలోని పాత కొత్త వర్గపోరుతో రోజుకో తలపోటు వచ్చి పడుతుంది. నిత్యం నియోజకవర్గంలో అధికార పార్టీ కార్యకర్తల ఘర్షణ అంటూ వార్తలు వినపడుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలో వంశీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో అందరినీ కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు. కొందరు తనపై గొడవలు సృష్టించి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధిష్ఠానం కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని వంశీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
తనపై లేనిపోని నిందలు మోపుతున్నారని వంశీ కినుక వహించారు. కాగా రాజకీయాల నుంచి తప్పుకునే యోచనలో ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం. భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యనేతలతో వల్లభనేని వంశీ చర్చలు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. గతంలో కూడా పార్టీలో చేరమని వైఎస్సార్ కాంగ్రెస్ ఒత్తిడి తెచ్చిన సమయంలో రాజకీయాల నుండి తప్పుకుంటా అని వంశీ లీకులు ఇచ్చారు.
అప్పట్లో పార్టీ అండగా ఉంటుంది అని చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు. ఆ తరువాత పార్టీ మారిపోయారు వంశీ. ఇప్పుడు కూడా పార్టీ నేతలను అదుపులో పెట్టండి అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధిష్టానాన్ని వంశీ ఈ రకంగా బెదిరిస్తున్నారా అనేది చూడాలి. నియోజకవర్గంలో ఇంతటి కలకలం రేగుతున్నందునే వైఎస్సార్ కాంగ్రెస్ ఉపఎన్నికల వైపు మొగ్గు చూపడం లేదు.




