పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఇంకో 14 రోజుల్లో వస్తోందన్న సందడి పెద్దగా కనిపించడం లేదు. బ్రో ఫీవర్ తో ఊగిపోవాల్సిన అభిమానులు వారాహి యాత్రలో పవన్ స్పీచుల ప్రవాహాన్ని ఆస్వాదిస్తూ, రాజకీయంగా మద్దతు ఇవ్వడం గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఫ్యానిజం హీరోకి, ఓటు నాయకుడికంటూ వేర్వేరుగా ప్రాధాన్యతలు పెట్టుకుంటూ వచ్చిన యువత ఇప్పుడు మార్పు దిశగా వెళ్తోంది.
ముఖ్యంగా వాలంటీర్ల మీద పవన్ సంధించిన ప్రశ్నలు జనంలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. దెబ్బకు నిన్నటి వారం దాకా ఇంటింటికి వెళ్లి డేటా సేకరించే పనిలో పడ్డ ప్రభుత్వం హఠాత్తుగా దానికి బ్రేక్ వేసి, పరిణామాలను సీరియస్ గా విశ్లేషించి, ఎదురుదాడి ఎలా చేయాలనే దాని గురించి బిజీగా ఉంది. అంటే ఆ ప్రసంగాల ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉందన్నది సుస్పష్టంగా కనిపిస్తోంది.
బ్రో బిజినెస్ ఆగలేదు. చక్కగా జరుగుతోంది. నిర్మాతలు ఆశించినట్టే నైజామ్ బయ్యర్లు మంచి రేట్లు ఇచ్చారు. ఏపి సర్కారు ధోరణి మీద అనుమానంగా ఉన్న ఆంధ్ర పంపిణీదారులు మాత్రం రిస్క్ లేకుండా సేఫ్ గేమ్ ఆడేలా ధరలు అడుగుతున్నారు. ఇది రేపో ఎల్లుండో తేలిపోతుంది కానీ వారాహి విజయం బ్రో అంచనాల మీద ఎఫెక్ట్ చూపిస్తున్న మాట కాదనలేని వాస్తవం.
ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలలకు పైగానే సమయం ఉన్నప్పటికీ ఫ్యాన్స్ మెల్లగా ఆ మూడ్ లోకి ఇప్పుడే వెళ్లిపోతున్నారు. బెనిఫిట్ షోలకు ఎలాంటి సంబరాలు చేయాలనే బదులు పార్టీ తరఫునా ఏమైనా కార్యక్రమాలు చేయగలమా, లేదా పవన్ కు మద్దతుగా వ్యతిరేకంగా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారనే దాని మీద దృష్టి పెడుతున్నారు. ట్వీట్లని తీవ్రంగా విశ్లేషించుకుంటున్నారు.
ఒకవేళ అసలు వారాహి యాత్రే ఈ మధ్య జరగలేదనుకుందాం. అప్పుడు ఖచ్చితంగా బ్రో అప్ డేట్స్ తప్ప అభిమానులకు మరో ప్రపంచం ఉండేది కాదు. పాటలు ఎప్పుడు వస్తాయి, పవన్ తేజు కాంబోలో సీన్లు ఎలా ఉంటాయి, త్రివిక్రమ్ డైలాగుల్లో ఎలాంటి పంచులు ఉంటాయనే లెక్కలతో సమయం గడిపేవారు. ఇప్పుడు తమ హీరో ఎక్కడ ఏం మాట్లాడుతున్నాడనేదే వాళ్లకు ముఖ్యమైపోయింది.
అలా అని బ్రోకు ఓపెనింగ్స్ తక్కువ రావడమో లేదా పట్టించుకోకపోవడమో ఉండదు. పవర్ స్టార్ బ్రాండ్ కు ఢోకా లేకపోయినా వారాహి హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఓ రీమేక్ సినిమాను జనాలకు దగ్గర చేయాలంటే క్రేజీగా ఏదైనా ప్లాన్ చేయాలి. భీమ్లా నాయక్, వకీల్ సాబ్ టైంలో ఇలాంటి వాతావరణం లేదు. కానీ జనసేన సమీకరణలు మారిన నేపథ్యంలో బ్రో కోసం పెద్ద కసరత్తే చేయక తప్పదు.



