మైలవరంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కి మంత్రి జోగి రమేష్‌కి మద్య గత ఏడాదిన్నరగా సాగుతున్న విభేధాలు సోషల్ మీడియా వరకు వచ్చేయడంతో సిఎం జగన్మోహన్ రెడ్డి నష్టనివారణ చర్యలు చేపట్టారు. వసంత కృష్ణప్రసాద్‌ని తాడేపల్లికి పిలిపించుకొని ఆయనతో మాట్లాడారు. మంత్రి జోగి రమేష్ తన మైలవరం నియోజకవర్గంలో జోక్యం చేసుకొంటూ తనని చాలా ఇబ్బంది పెడుతున్నారని వసంత కృష్ణప్రసాద్ సిఎం జగన్‌కి ఫిర్యాదు చేశారు.
“నేను ఎప్పుడు ఇతర నియోజకవర్గాలలో జోక్యం చేసుకోను… నాదానిలో మరొకరి జోక్యం సహించనని” ముఖ్యమంత్రికి ఖరాఖండీగా చెప్పానన్నారు. మంత్రి హోదాలో ఉంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఇబ్బంది పెడుతుండటం సరికాదని చెప్పానని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. అయితే ఇటువంటి సమస్యల కారణంగా గడప గడపకి కార్యక్రమంలో పాల్గొనకపోవడం సరికాదని ముఖ్యమంత్రి అన్నారని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. రాబోయే 25-30 ఏళ్ళు తనతో కలిసి రాజకీయాలలో ప్రయాణించవలసి ఉంటుందని కనుక పార్టీ నేతలతో ఏమైనా విభేదాలున్నట్లయితే తన కార్యదర్శి ధనుంజయరెడ్డికి తెలియజేయాలని ముఖ్యమంత్రి సూచించారని అన్నారు. మైలవరంలో మంత్రి జోగి రమేష్ జోక్యం చేసుకోకుండా కట్టడి చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. తక్షణం గడప గడపకి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని తెలిపారు.
తనకి ముఖ్యమంత్రిపై ఎంతో గౌరవం, నమ్మకం ఉంది కానీ పార్టీలో ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుండటం బాధగా ఉందన్నారు. ఇకపై మంత్రి జోగి రమేష్ మైలవరం నియోజకవర్గంలో వేలు పెడితే సహించబోనని వసంత కృష్ణప్రసాద్ హెచ్చరించారు. గతంలో అనేకమంది మంత్రులతో కలిసి పనిచేశానని జోగి రమేష్ వంటి మంత్రిని ఎన్నడూ చూడలేదన్నారు వసంత కృష్ణప్రసాద్.
ముఖ్యమంత్రి వద్దకి ఈ పంచాయతీ చేరుకొంది కనుక ఇకనైనా మంత్రి జోగి రమేష్ మైలవరానికి, వసంత కృష్ణప్రసాద్‌కి దూరంగా ఉంటారో లేదో?తనపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినందుకు వసంత కృష్ణప్రసాద్‌పై ప్రతీకారం తీర్చుకొనే ప్రయత్నం చేస్తే సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. ఇప్పటికే ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి చేజారిపోయారు. కనుక వసంత కృష్ణ ప్రసాద్ కూడా చేజారిపోకుండా ముఖ్యమంత్రే కాపాడుకోవవలసి ఉంటుంది.



