టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌లను వ్యక్తిగతంగా దూషిస్తూ, అవహేళన చేస్తున్న వైసీపి నేతలలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ముందుంటారు. అలాగే మంత్రులు అంబటి రాంబాబు, రోజాలు కూడా.
కనుక వచ్చే ఎన్నికలలో వీరు ముగ్గురినీ ఎట్టి పరిస్థితులలో కూడా గెలవనీయకుండా చేయాలని టిడిపి చాలా పట్టుదలగా ఉంది. ఇప్పటికే సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుని ధీటుగా ఎదుర్కోగల కన్నా లక్ష్మీనారాయణని ఇన్‌చార్జిగా చంద్రబాబు నాయుడు నియమించారు. తాజాగా గుడివాడలో కొడాలి నానిని కొమ్ములు వంచగల సమర్ధుడని భావిస్తున్న వెనిగండ్ల రాముని టిడిపి ఇన్‌చార్జిగా నియమించారు.
వెనిగండ్ల రాము అమెరికాలోని వెరిడిక్ హోల్డింగ్స్ అనే కంపెనీని స్థాపించి దానితో సుమారు రెండున్నర దశాబ్ధాలకు పైగా భారత్, అమెరికాలోని సాఫ్ట్ వేర్, స్టార్టప్ కంపెనీలకు సేవలందిస్తున్నారు. ముఖ్యంగా నష్టాలలో కూరుకుపోయిన కంపెనీలు మళ్ళీ కోలుకొని లాభాలబాట పట్టేందుకు అవసరమైన సాంకేతిక, ఫైనాన్సింగ్, మార్కెటింగ్ తదితర సేవలు అందిస్తున్నారు. ఆంధ్రాలో కేశినేని డెవలపర్స్ వంటి అనేక సంస్థలకు అవసరమైన బిజినెస్ వ్యూహాలను అందిస్తున్నారు.
విదేశంలో స్థిరపడి చాలా సుఖంగా జీవిస్తున్న వెనిగండ్ల రాము మొదటి నుంచి ఎన్టీఆర్ వీరాభిమాని. చంద్రబాబు నాయుడు, టిడిపి కోసం ప్రాణం పెట్టేందుకు సిద్దంగా ఉంటారు. 2019 ఎన్నికలలో టిడిపి ఓడిపోయిన తర్వాత ఆయన గుడివాడ వచ్చేసి అప్పటి నుంచే నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తూ, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడుని దూషిస్తున్న కొడాలి నానిని ఓడించడమే తన ఏకైక లక్ష్యమని చెపుతుంటారు. చెప్పడమే కాదు… గత నాలుగేళ్ళుగా నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు.
గుడివాడలో క్రీస్టియన్స్, కమ్మ, కాపు కులస్థులు కూడా ఎక్కువే ఉన్నారు. వెనిగండ్ల రాము ప్రయత్నాల వల్లనైతేనేమీ, కొడాలి నాని నోటి దురుసుతనం, వ్యవహారశైలి వల్లనైతేనేమి వారందరూ కొడాలి నానికి వ్యతిరేకంగా మారారు.
వారందరినీ టిడిపివైపు మళ్ళించడం కోసం వెనిగండ్ల రాము చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. అందుకే కొడాలి నాని ఇప్పుడు చల్లబడిపోయారని, ఇదివరకులా మీడియా ముందుకు వచ్చి నోటికి వచ్చిన్నట్లు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చిరంజీవి గురించి మాట్లాడటం లేదనే టాక్ వినిపిస్తోంది. కొడాలి నానిని ఎన్నికలకు ముందే ఈవిదంగా కట్టడి చేస్తున్నందుకే చంద్రబాబు నాయుడు వెనిగండ్ల రాముని గుడివాడ టిడిపి ఇన్‌చార్జిగా నియమించిన్నట్లు తెలుస్తోంది.
గుడివాడ నుంచి రావి వెంకటేశ్వరరావు కూడా టిడిపి టికెట్ ఆశిస్తున్నారు. అయితే కొడాలి నానిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని వెనిగండ్ల రాముతో కలిసి పనిచేయాలని చంద్రబాబు నాయుడు ఆయనకు నచ్చజెప్పారు. ఈసారి ఎన్నికలలో జనసేన కూడా టిడిపితో కలిసి పనిచేస్తోంది కనుక గుడివాడలో కొడాలి నానిని డిపాజిట్ కూడా దక్కకుండా ఓడించాలని వెనిగండ్ల రాము చాలా పట్టుదలగా ఉన్నారు. కనుక కొడాలి నానికి ఆయనే సరైనవారని చెప్పక తప్పదు.




