తెలుగు సినీ పరిశ్రమలో ‘ఈగో’ పదానికి దూరంగా ఉన్న హీరో ఎవరు అంటే… మొదట గుర్తుకు వచ్చే పేరు విక్టరీ వెంకటేష్. ఆధ్యాత్మిక శోభ ఎక్కువగా కలిగిన విక్టరీ, “మనం జీవించేది అంతా పై వాడు నడిపిస్తాడు… మన చేతుల్లో ఏమీ లేదు…” అంటూ బోధన చేస్తారు. బహుశా ఆ ఆలోచనలే టాలీవుడ్ లో మల్టీస్టారర్ ట్రెండ్ కు శ్రీకారం చుట్టేలా చేసిందేమో గానీ, నవతరం మల్టీస్టారర్ సినిమాలకు వెంకీ కేరాఫ్ అడ్రస్.
ఇప్పటికే పలు మల్టీస్టారర్ సినిమాలలో నటించి, తన ఆలోచనలను చాటిచెప్పిన వెంకీ, తాజాగా ఓ అతిథి పాత్రకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ట్రేడ్ వర్గాల టాక్. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘ప్రేమమ్’ సినిమాలో చైతూ తండ్రి పాత్రలో వెంకీ కనిపించనున్నారని, ఇప్పటికే వీరిద్దరి మధ్య సన్నివేశాల చిత్రీకరణ కూడా చిత్ర యూనిట్ పూర్తి చేసిందని సినీ వర్గాల సమాచారం.
‘కార్తీకేయ’ సినిమా దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఆగష్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. రియల్ జీవితంలో మామ అల్లుళ్ళు వరుసైన వెంకీ – చైతూల జోడి రీల్ స్క్రీన్ పై తండ్రి – కొడుకులుగా కనపడితే ఎలా ఉంటుందో చూడాలంటే, విడుదల వరకు వెయిట్ చేయాలి. ఈ వార్తలు నిజమైతే ‘ప్రేమమ్’ సినిమాకు మార్కెట్ వర్గాలతో పాటు సినీ ప్రేమికుల్లో క్రేజ్ ఏర్పడినట్లే!



