ఈమధ్య సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. థియేటర్లో సూపర్ హిట్ లేదా మంచి హిట్ అనిపించుకున్న సినిమా.. ఓటీటీ రిలీజ్ కి వచ్చేసరికి మాత్రం చీల్చి చెండాడబడుతుంది. నిజానికి రిలీజ్ టైంలోనే సదరు కంటెంట్ పై హానెస్ట్ ఫీడ్ బ్యాక్ వినిపించినా.. పెయిడ్ పోస్టులు, మీమ్స్ తో వాటిని డామినేట్ చేయించేస్తున్నారు మేకర్స్.
అయితే.. ఓటీటీ రిలీజ్ టైంకి కవర్ చేయలేక చేతులెత్తేయడంతో, అప్పుడు సినిమా అసలు జాతకం బయటపడుతుంది. అందుకు తాజా ఉదాహరణ “విశ్వనాథ్ & సన్స్”. థియేటర్లలో రిలీజైనప్పుడు అందరూ దీన్ని మోడ్రన్ క్లాసిక్ అనీ, వెంకీ అట్లూరి నెక్స్ట్ త్రివిక్రమ్ అని తెగ హడావుడి జరిగింది. కట్ చేస్తే.. గతవారం ఓటీటీకి వచ్చినప్పటినుండి సీనియర్ క్రిటిక్స్ మొదలుకొని.. సాధారణ ప్రేక్షకుల వరకు అందరూ సెకండాఫ్ లో లోటుపాట్లపై దుమ్మెత్తిపోశారు.
దాంతో జూనియర్ త్రివిక్రమ్ అనే ట్యాగ్ అటకెక్కి, అంత మంచి పాయింట్ తీసుకొని.. అలా డీల్ చేశావేంటి వెంకీ అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. ఇది వెంకీ అట్లూరి విషయంలో మాత్రమే కాదు, సాయిరాజేష్, ఆదిత్య హాసన్ లా విషయాల్లోనే అదే జరిగింది.
“చెన్నై లవ్ స్టోరీ” సినిమాని కల్ట్ క్లాసిక్ అంటూ భీభత్సంగా ప్రమోట్ చేసారు రిలీజ్ ముందు నుండే. అయితే.. ప్రేక్షకులు మాత్రం కల్ట్ స్టేటస్ ఇవ్వలేదు. మరీ ముఖ్యంగా ఓటీటీ రిలీజ్ తర్వాత కిరణ్ అబ్బవరం పెర్ఫార్మెన్స్ & రేటింగ్ గురించి చాలా వరస్ట్ గా మాట్లాడుకున్నారు జనాలు.
ఇక “90’s” వెబ్ సిరీస్ తో డైరెక్టర్ గా, “ప్రేమలు”తో డైలాగ్ రైటర్ గా, “లిటిల్ హార్ట్స్”తో ప్రొడ్యూసర్ గా సూపర్ హిట్స్ అందుకుని.. తన మొదటి థియేటరికల్ సినిమా “ఎపిక్”కి మాత్రం ఆ మ్యాజిక్ క్రియేట్ చేయలేక చతికిలపడ్డాడు ఆదిత్య హాసన్.
వెంకీ అట్లూరి, ఆదిత్య హాసన్, సాయి రాజేష్.. ఈ ముగ్గురూ ప్రామిసింగ్ రైటర్-డైరెక్టర్లే. అయితే.. ముగ్గురు తమ సినిమాతో ప్రేక్షకుల్ని పూర్తిస్థాయిలో అలరించలేక బొటాబొటి మార్కులతో సరిపెట్టుకున్నవారే. ముఖ్యంగా ఈ ముగ్గురు ఫెయిల్ అయింది మోడ్రన్ ఏజ్ లో రిలేషన్స్ షిప్స్ ని హ్యాండిల్ చేయడంలో.
ఆదిత్య హాసన్ తన పర్సనల్ లైఫ్ ఎక్స్ పీరియన్స్ తో ఆడియన్స్ ని రిలేట్ చేయించలేక ఫెయిల్ అయితే, వెంకీ అట్లూరి చాలా ప్రామిసింగ్ గా మొదలుపెట్టిన కథను, సెకండాఫ్ లో ఎటెటో పట్టుకెళ్ళి నిరాశపరిచాడు. ఇక సాయిరాజేష్ తన రచనలో ఆత్మ ప్రేమకథను డీల్ చేసిన విధానాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోయారు. అందుకే.. వీళ్ల నెక్స్ట్ సినిమాలు ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేకపోయినప్పటికీ.. సదరు సినిమాలతో తమ పనితనం నిరూపించుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
మరి ఈ హానెస్ట్ ఫీడ్ బ్యాక్ ని ఈ ముగ్గురు ప్రామిసింగ్ రైటర్స్ కమ్ డైరెక్టర్స్ బుర్రకెక్కించుకొని జాగ్రత్తపడతారో.. లేక ఎప్పట్లానే తాము నమ్మిందే కరెక్ట్, ఆడియన్స్/క్రిటిక్స్ తమని అర్థం చేసుకోలేదని మొండిగా ఉంటారో చూడాలి.




