ఏప్రిల్ 23 న 234 స్థానాలకు గాను జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరు పార్టీ అధినేతల నామినేషన్లతో మొదలయ్యింది. నేడు డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొలత్తూరు నుంచి వరుసగా మూడోసారి నామినేషన్ దాఖలు చేసారు.
అలాగే టీవీకే పార్టీ అధినేతగా నటుడు విజయ్ సైతం ఇవాళ పెరంబూరు నుంచి నామినేషన్ వేశారు. అయితే పార్టీ అధినేతగా విజయ్ పెరంబూరు, తూర్పు తిరుచ్చి అనే రెండు నియోజకవర్గాల నుంచి తన అదృష్టం పరీక్షించుకోనున్నారు.
ఇందులో మొదటి నామినేషన్ గా విజయ్ పెరంబూరు ని ఎంచుకుని అక్కడ తన తొలి నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ ప్రక్రియకు గాను విజయ్ తో పాటు ఆయన అభిమానులు, టీవీకే పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ మీకు మంచి జరగాలి అంటే ‘విజిల్’ కి ఓటు వేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
విజయ్ టీవీకే పార్టీకి ఎన్నికల సంఘం విజిల్ గుర్తు కేటాయించడంతో విజయ్ తన పార్టీ సింబల్ ని ప్రజలకు చేరువ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే విజయ్ రెండు చోట్ల పోటీ అంటూ బరిలోకి దిగడంతో ఈ రెండు చోట్ల పోటీతో గట్టున పడ్డవారి చరిత్రను, ఇదే కాన్సెప్ట్ తో నిండా మునిగిపోయిన వారి ఉదంతాన్ని విజయ్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
ఏదిఏమైనా, ఏ పార్టీ నుండి ఎన్ని రాజకీయ ఒత్తిడులు ఎదురైనా, ఎన్ని వ్యక్తిగత వివాదాలు తెరమీదకు వచ్చినా, తన చుట్టూ అన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా విజయ్ మాత్రం ఒంటరి పోరాటానికే మొగ్గు చూపుతూ నేడు తన తొలి నామినేషన్ ను ఖరారు చేసుకున్నారు. మరి విజయ్ తమిళ రాజకీయ దిగ్గజాలను ఎదురించి ప్రజలను తన వైపుకి తిప్పుకోగలరా.?
తన సినీ అభిమానులను తన పార్టీ ఓటర్లుగా మలచుకోగలరా.? ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగడలను ఛేదించి పోటీ చేసిన రెండు చోట్ల ఓటర్ల నుంచి విజిల్ కొట్టించుకోగలరా.? పార్టీని అధికారంలోకి తీసుకురాగలరా.? రానున్న రోజులలో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు విజయ్ ని పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఇదిలా ఉంటే మరోపక్క తన పర్సనల్ కార్ డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరీనాథ్ కు టీవీకే పార్టీ తరుపున ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు విజయ్. విరుగంపాక్కం నియోజకవర్గం నుంచి శబరి పోటీలోకి దిగబోతున్నారు అంటూ వేదిక మీద విజయ్ ప్రకటించడంతో సదరు రాజేంద్రన్, ఆయన తనయుడు శబరీ ఇద్దరు కొంత భావోద్వేగానికి గురై విజయ్ ని కౌగలించుకున్నారు.
ఇలా రాజకీయంగా విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు టీవీకే పార్టీకి ఏమేరకు విజయాలను తెచ్చిపెట్టబోతున్నాయి.? ఏ స్థాయిలో విజయ్ TVK తమిళ రాజకీయాలలో తన సత్తా చాటబోతుంది.? విజయ్ TVK తమిళ రాజకీయాలలో మరో కొత్త అధ్యాయం రాయనున్నారా.? అన్నది రానున్న రోజులలో తేలనుంది.






