అభిమానుల ‘అత్యుత్సాహం’ సినీ పొలిటికల్ స్టార్స్ కళ్ళు కప్పుతున్నాయా.?

Thalapathy Vijay with TVK party backdrop highlighting debate on fan support and political success in Tamil Nadu elections.

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో ఇమేజ్ ఉన్న నటులు తమ అభిమానుల కేరింతలతో వారి అరుపులు కేకలతో చాల ఉత్సాహపడుతుంటారు. 2 1/2 గంటల సినిమాలో నాలుగు పంచ్ డైలాగ్స్, నాలుగు పాటలు, నాలుగు ఫైట్లతో హీరోలు సమాజాన్ని ఎంతో చైతన్య వంతులను చేసేస్తుంటారు, అదే విధంగా తన ప్రత్యర్థులను పాతాళానికి తొక్కేస్తుంటారు.

కానీ నిజజీవితంలో ఈ పనులు చేయడానికి దశాబ్దాల సమయం కూడా సరిపోదనే చెప్పాలి. అలాగే వారు ప్రత్యర్థులను చిత్తూ చేయడం సంగతి అటుంచితే ప్రత్యర్థులు కొట్టే దెబ్బల నుంచి తనను తానూ కాపాడుకోవడమే ఆ హీరోకి సవాల్ గా మారతాయి.

ADVERTISEMENT

మరీ ముఖ్యంగా సినీ పొలిటికల్ స్టార్స్ విషయంలో ఈ ఎదురుదెబ్బలు వారు దశాబ్దాలుగా సినీరంగంలో కష్టపడి చమటోర్చి ప్రేక్షకుల నుంచి సంపాధించుకున్న స్టార్ ఇమేజ్ ని సైతం రాజకీయాలు ఒక్క ఏడాదిలోనే ఆవిరి చేసేస్తాయి. మొన్న PRP తో మెగా స్టార్ చిరంజీవి, నిన్న JSP తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నేడు TVK తో దళపతి విజయ్ ఇటువంటి సమస్యనే ఎదుర్కొన్నారు.

నాడు దశాబ్దాల పాటు సినీరంగంలో అగ్ర హీరోగా ఉన్న మెగాస్టార్ ప్రజారాజ్యంతో రాజకీయ ఎంట్రీ ఇస్తే ఆ ఇమేజ్ మొత్తానికి రాజకీయ రంగం మూడేళ్లకే చెదలు పట్టించేసింది. ప్రజారాజ్యం పార్టీ ప్రకటన నుంచి మెగాస్టార్ ఎన్నికల ప్రచారాల వరకు చిరు వెనుక లక్షలాదిమంది అభిమాన బలం ఉంది.

అయన ఎక్కడికెళ్తే అక్కడికి వచ్చి చిరు కోసం ఎగబడడం, ఆయన చెప్పే స్పీచులకు చప్పట్లు కొట్టడం, ఆయన ముందు వెనుక సీఎం సీఎం అంటూ జై జై ద్వానాలు వినిపిస్తూ చిరుకి తన రాజకియ బలమెంతో తెలియకుండా చేసారు. దాని ఫలితమే ప్రజారాజ్యం ‘ఒంటరి పోరాటం’ 18 సీట్లకు పరిమితమయ్యింది, మూడేళ్లకే పార్టీ కాంగ్రెస్ లో విలీనం తో తనువు చాలించింది.

ఇక రాష్ట్ర విభజన తరువాత జనసేనతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు కూడా సేమ్ ఇదే పరిస్థితి. పవన్ అడుగు బయట పెడితే సీఎం సీఎం అనే నినాదాలు, ఆయన సభ పెడితే ఇసుకేస్తే రాలనంత జనం, సమయం, సందర్భం ఏదైనా మండుటెండైన ఎండైనా, జోరున వానైనా పవన్ కోసం ప్రజలు రోడ్ల మీద బారులు తీరేవారు.

అయితే ఈ నినాదాల మత్తులో, అభిమానుల కేరింతల ఊపులో 2019 లో పవన్ తన రాజకీయ బలాన్ని గుర్తించలేక జనసేనతో ఒంటరి రాజకీయ ప్రయాణం చేసారు. ఫలితం పోటీ చేసిన రెండు చోట్ల పవన్ ఓటమి, దానికి తోడు రాజకీయ ప్రత్యర్థుల అవమానాలు, అవహేళనలు.

అయితే ఇప్పుడు అసలైన రాజకీయం ఒంటపట్టించుకున్న పవన్ అభిమానులు కేకలు – అరుపులకు కాకుండా ప్రజా ఓటర్ల దిశగా అడుగులేశారు. 2024 ఎన్నికలలో టీడీపీ, బీజేపీ తో కూటమి కట్టిన పవన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా గౌరవమన్ననలను అందుకుంటున్నారు.

అయితే ఇప్పుడు తమిళనాడులో TVK తో రాజకీయ ప్రవేశం చేసిన దళపతి విజయ్ సైతం తమ సినీ అభిమానుల కేరింతలతో రాష్ట్రంలో తన, తన పార్టీ రాజకీయ బలాన్ని అంచనా వేయలేకపోతున్నారా.? ఆ అభిమానుల అరుపులు – కేకలు విజయ్ కళ్ళకు గంతలు కడుతున్నాయా.?

కళ్ళ ముందు ఇందరి స్టార్ హీరోల రాజకీయ జీవితం ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తున్న విజయ్ ఇంకా వాస్తవానికి దగ్గరగా ఆలోచించలేకపోతున్నారా.? అందుకే విజయ్ కూడా తమిళనాడులో రాబోయే ఎన్నికలలో TVK ఒంటరి పోటీ అంటూ ప్రకటిస్తూ ప్రత్యర్థుల రాజకీయ పద్మవ్యూహంలో చిక్కుకోబోతున్నారా.? విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించినంత ఈజీ గా ఎన్నికల తంతుని పూర్తి చెయ్యగలరా.?

అభిమానులను పార్టీ క్యాడర్ గా మలచుకోవాలి, పార్టీని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లగల్గాలి, పోలింగ్ మెళుకువలు తెలియాలి, బూత్ స్థాయి లీడర్లు ఉండాలి, కొత్త నాయకులను తయారు చేసుకోవాలి, ఉన్న నాయకులను తన వైపు తిప్పుకోగలగాలి,

దశాబ్దాలుగా రాజకీయాలలో తలలు పండిన నేతల రాజకీయ వ్యూహాల నుంచి తప్పించుకుంటూ ఉండాలి, వ్యక్తిగత జీవితానికి కూడా జవాబుదారిగా ఉండగలగాలి…ఇలా చెప్పుకుంటూ పొతే పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అంత చిట్టా పొద్దే ఉంటుంది.

ఇవన్నీ ఒక 2 1/2 గంటలలో పూర్తి చేయగలిగే తంతు కాదు. కాబట్టి సినీ పొలిటికల్ స్టార్స్ తమ అభిమానుల సినీ అభిమానాన్ని రాజకీయ మద్దతుగా భావించకూడదు. అలా భావించి ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ఒంటరి పోరు అంటూ ముందుకెళ్లితే దాని తరువాత రానున్న పర్యవసానాలను అంచనా వేయడం చాల కష్టమనే చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories