ఈసారి లోక్‌సభ ఎన్నికలలో నెల్లూరు నుంచి వైసీపి అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న విజయసాయి రెడ్డి మొన్న ఉదయగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు, ఆయనను చూసి మహిళలందరూ వెనక్కు తిరిగి వెళ్ళిపోతుంటే, అమ్మా వెళ్ళిపోకండి… వచ్చి పెద్దాయన మాటలు వినండి. మీ అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశాము,” అంటూ పక్కనే ఉన్న వైసీపి నేత ఒకరు మైకులో బ్రతిమలాడుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ విషయం విజయసాయి రెడ్డి దృష్టికి రావడంతో ఆయన కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ, “ఎలక్షన్ షెడ్యూలు విడుదలైనప్పటి నుంచి కూటమి ప్రచారంపై నమ్మకం పెట్టుకోకుండా ఎల్లో మీడియా అసత్య కథనాలపైనే ఆశలు పెట్టుకున్నారు చంద్రబాబు గారు. మా సభలకు వచ్చే ప్రజలు మాట్లాడుతుండగానే వెళ్లిపోతున్నారంట.
అనుకూల మీడియాలో రాయించుకుని మురిసిపోతున్నాడు. ఇది జరుగుతోంది మీ సభల్లోనే కదా బాబు గారూ. సోషల్ మీడియాలో మిమ్మల్ని ఓ కమేడియన్‌లా ఆడుకుంటున్నారు యువత. పచ్చ మీడియా కంటే సోషల్ మీడియా శక్తి వెయ్యి రెట్లు ఎక్కువ. 1980 నాటి మైండ్ సెట్లో ఉన్నారు. మీకిప్పుడే అర్థం కాదులే,” అని ట్వీట్ చేశారు.
కానీ ఆ వీడియో చూస్తే దాంతో చంద్రబాబు నాయుడుకి, మీడియాకి ఎటువంటి సంబంధమూ లేదని, ఆ సమయంలో అక్కడే ఉన్నవారు ఎవరో తమ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారని అర్దమవుతూనే ఉంది. కనుక విజయసాయి రెడ్డి ఈ విషయాన్ని అక్కడితో వదిలేసి ఉంటే, సోషల్ మీడియా ప్రవాహంలో మొన్నటి వార్త కనబడకుండా కొట్టుకుపోయి ఉండేది.
కానీ విజయసాయి రెడ్డి పనిగట్టుకొని దానిని గుర్తుచేసి చంద్రబాబు నాయుడుని విమర్శించడంతో మళ్ళీ ‘భోజనాలు పెడతాం రండమ్మా రండి…’ వీడియోని నెటిజన్స్ వెతికి పట్టుకొని ఆయనకు ట్యాగ్ చేస్తున్నారు. పచ్చ మీడియా కంటే సోషల్ మీడియా వెయ్యి రెట్లు శక్తివంతమైనదని విజయసాయి రెడ్డి సర్టిఫై చేస్తున్నప్పుడు, మళ్ళీ ఇలా పాత విషయాలను కెలుక్కోవడం ఎందుకు?మళ్ళీ నెటిజన్స్ చేత కామెంట్స్ చేయించుకోవడం దేనికి?
చంద్రబాబు నాయుడు కూటమి ప్రచారం కోసం ఎదురుచూడటం కాదు… ఆయన ప్రచారం కోసమే కూటమిలో అభ్యర్ధులు అందరూ ఎదురుచూస్తున్నారని అందరికీ తెలుసు.
చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌పై నమోదైన కేసులకు భయపడి మోడీ శరణు కోరి ఎన్డీయేలో బలవంతంగా దూరిపోయారంటూ విజయసాయి రెడ్డి మరో ట్వీట్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు తనను ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేకనే జనసేన, బీజేపీలతో పొత్తులు పెట్టుకున్నారని జగన్ వాదిస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు. వైసీపి దౌర్జన్యాలను చూసిన చంద్రబాబు నాయుడు, ఈ ఎన్నికలలో వైసీపి చెలరేగిపోకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించాలనే ఏకైక కారణంతోనే బీజేపీతో పొత్తుకి సిద్దపడ్డారని విజయసాయి రెడ్డికు తెలియనిది కాదు కదా?




