ఒకప్పుడు అన్నా చెల్లలు అని చెప్పుకున్న కేసీఆర్ విజయశాంతి ఆ తరువాతి కాలంలో ఒకరినొకరు విబేధించుకున్నారు. కేసీఆర్ విజయశాంతిని పార్టీనుంచి బహిష్కరించడంతో ఆమె కేసీఆర్ కు బద్ద వ్యతిరేకిగా మారిపోయారు. ఆ తరువాత కొంత కాలం కాంగ్రెస్ లో ఉన్న ఆవిడ తాజాగా బీజేపీలో చేరి మళ్ళీ రాజకీయంగా యాక్టీవ్ గా అయ్యే పనిలో పడ్డారు.
ఈ సందర్భంగా ఆమె పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆమె కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ దగ్గర డుబ్బులు కూడా ఉండేవి కావని.. డబ్బు ఇచ్చేవారు ఎవరైనా దొరుకుతారా అని వెతికేవారని చెప్పారు. ఉద్యమం కోసం తాను కూడా కేసీఆర్‌కు డబ్బులు ఇచ్చానని తెలిపారు.
ఉద్యమం కోసం వచ్చిన డబ్బును కేసీఆర్ కొద్ది కొద్దిగా మళ్లించుకునేవారని ఆరోపించారు. అందరి దృష్టి ఉద్యమపై ఉండటంతో.. కేసీఆర్ చేస్తున్న పనిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని చెప్పారు. సీఎం అయ్యాక కేసీఆర్‌కు డబ్బుపై ఆశ ఇంకా ఎక్కువైపోయిందని విజయశాంతి విమర్శించారు.
ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి.. ఆయన ఇంకా చెలరేగిపోతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ల్యాండ్‌లపై లక్ష కోట్ల రూపాయలను కేసీఆర్ వెనకేసుకున్నారని విజయశాంతి విమర్శించారు. గతంలో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు ఉండేవి… దానిని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లారు. ఇప్పుడు కేసీఆర్ పై బీజేపీ కూడా అదే వ్యూహంతో ముందుకు వెళ్తుంది.





